
Jana Sena Five Key Resolutions: జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలో దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన ‘సేన ప్రస్థానం – దేశ సమైక్యత కోసం’ సమావేశం ఐదు తీర్మానాలను ఆమోదించింది.
1. వికసిత్ భారత్ ఆకాంక్షల నుంచి విజయాల వైపు: అనే తీర్మానాన్ని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దార్శనిక నాయకత్వంలో 12 ఏళ్ల సుపరిపాలన ప్రస్థానాన్ని వెల్లడిస్తూ గడిచిన 12 ఏళ్ల కాలం అనేది కేవలం ఒక ప్రభుత్వ కొనసాగింపు మాత్రమే కాదని.. ఇది దేశ ప్రజాస్వామ్య వికాసంలో, జాతీయ పునరుజ్జీవనంలో ఒక సువర్ణ అధ్యాయమని జనసేన బలంగా నమ్ముతోందని ఈ తీర్మానంలో పేర్కొన్నారు. ఈ తీర్మానాన్ని ఏపీ ఎంఎస్ఐడిసి ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు బలపరిచారు.
2. నేషన్ ఫస్ట్: ఈ తీర్మానాన్ని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ప్రతిపాదించారు. నేషన్ ఫస్ట్ అనే సిద్ధాంతాన్ని జనసేన బలంగా నమ్ముతోందని ఈ తీర్మానంలో పేర్కొన్నారు. ‘దేశ సమగ్రత, ఐక్యత, జాతీయ దృక్పథం, ప్రతి పౌరునికి సమాన న్యాయం అనే విలువల పట్ల జనసేన పార్టీకి అచంచలమైన నిబద్ధత ఉంది. కులం, మతం, భాష, ప్రాంతాలకు అతీతంగా భారతదేశపు వైవిధ్యంలో ఏకత్వం, నాగరికతా విలువలు మరియు ప్రజాస్వామ్య సంప్రదాయాలే దేశ బలానికి మూలాధారాలని పార్టీ విశ్వసిస్తోంది’ అని ఈ తీర్మానం ద్వారా స్పష్టం చేశారు. జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను బలపరిచారు.
3. సంక్షోభం నుంచి నమ్మకం వైపు: ఆంధ్రప్రదేశ్‌లో రెండేళ్ల పునర్నిర్మాణం, సంక్షేమం, అభివృద్ధి అనే అంశంపై మూడో తీర్మానాన్ని ఈ సమావేశంలో ప్రవేశపెట్టారు. అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ప్రతిపాదించగా ఏపీ తూర్పుకాపు వెల్ఫేర్ కార్పొరేషన్ ఛైర్మన్ పాలవలస యశస్వి బలపరిచారు.
4. జనసేన పార్టీ పుష్కర కాల ప్రస్థానం: త్యాగం, సేవ, ప్రజల నమ్మకం తాలూకు ప్రయాణం అనే అంశాన్ని ప్రవేశపెట్టారు. తెలంగాణకు చెందిన నాయకురాలు పి.శిరీష ప్రతిపాదించారు. సామాజిక మార్పు, నైతిక రాజకీయాలు, అందరికీ సమాన అభివృద్ధి అనే ఆశయాలతో మొదలైన జనసేన పార్టీ, విజయవంతంగా 12 ఏళ్ల చారిత్రాత్మక ప్రయాణాన్ని పూర్తి చేసుకోవడం పట్ల నాయకులు, శ్రేణులు ఎంతో సంతోషంగా, గర్వంగా ఉన్నారని ఈ తీర్మానంలో పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కి ఈ తీర్మానం ద్వారా పార్టీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. పవన్ దార్శనికత, త్యాగం, పట్టుదలే జనసేనను ఈ రోజు ప్రజల్లో ఒక బలమైన రాజకీయ శక్తిగా నిలబెట్టాయని వెల్లడించారు. ఈ తీర్మానాన్ని ఏపీ సృజనాత్మక, జానపద కళల అకాడెమీ ఛైర్మన్ వంపూరు గంగులయ్య బలపరిచారు.
5. యువత ఆకాంక్షలు- జనసేన: యువత ఆకాంక్షలను జనసేన అర్థం చేసుకొంటుందని అయిదో తీర్మానం ద్వారా ప్రతిపాదించారు. ఈ తీర్మానాన్ని అహుడా ఛైర్మన్ టి.సి.వరుణ్ ప్రతిపాదించగా పార్టీ యువ నాయకుడు, నటుడు తనీష్ బలపరిచారు.