Reading Time: < 1 minute

ఆడపిల్ల పుట్టిందని భార్యను వదిలేసి.. మరో మహిళతో సహజీవనం చేస్తున్న భర్త

Caption of Image.

ఆడపిల్ల పుట్టిందనే అనాగరిక కారణంతో కట్టుకున్న భార్యను, కన్నకూతురిని నడిరోడ్డుపై వదిలేసిన ఒక భర్త దారుణోదంతం వెలుగులోకి వచ్చింది. భార్యను కాదని మరో మహిళతో సహజీవనం చేస్తూ, కొత్త కాపురం పెట్టాడంటూ సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెల్లువెత్తిన ఆరోపణలు ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారాయి.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి జిల్లాకు చెందిన అర్చనకు 2012లో రవితో వివాహం జరిగింది. పెళ్లైన కొత్తలోనే ఉమ్మడి కుటుంబం పేరుతో ఇంటి పనులు, వ్యవసాయ పనుల భారం మోపడమే కాకుండా, అత్తింటి వేధింపులు మొదలయ్యాయి. అయితే, అర్చన ఆడపిల్లకు జన్మనిచ్చాక రవి, అతని కుటుంబ సభ్యుల వైఖరిలో మార్పు వచ్చింది. ఆమెను తీవ్ర నిర్లక్ష్యం చేయడమే కాకుండా, తన భార్యపై విడాకుల కోసం రవి వనపర్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ నెల 28న ఈ కేసులో ఫైనల్ హియరింగ్ ఉండగా.. కోర్టుకు హాజరు కాకుండా రవి తప్పించుకుని తిరుగుతున్నాడని బాధితురాలు ఆరోపిస్తోంది.

అసలు రంగు బయటపడింది. తనకు ఉన్న 10 ఎకరాల భూమిలో వాటా దక్కకుండా ఉండాలని, ముందస్తు ప్రణాళికతో అందులో 8 ఎకరాలను తన అక్క పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడని అర్చన ఆరోపిస్తోంది. అటు తర్వాత హైదరాబాద్‌ మకాం మార్చిన రవి.. మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడని, ఇప్పటికే వారికి ఇద్దరు మగపిల్లలు కూడా పుట్టారని తెలియడంతో బాధితురాలు షాక్‌కు గురైంది. స్థానికుల సహాయంతో రవి నివాసాన్ని గుర్తించిన అర్చన.. అతడిని పట్టుకుని సరూర్‌నగర్ పోలీసులకు అప్పగించి, తమకు న్యాయం చేయాలని వేడుకుంటోంది.

కన్నకూతురు పుట్టిందనే కారణంతో కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి, అడ్డదారిలో మరో కాపురం పెట్టిన రవిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తనకు, తన కుమార్తెకు భరణం ఇప్పించాలని, చట్టపరంగా ఆదుకోవాలని అర్చన కన్నీరుమున్నీరవుతోంది. అయితే ఈ ఆరోపణలపై రవి లేదా సంబంధిత వ్యక్తుల స్పందన తెలియాల్సి ఉంది. పూర్తి స్థాయి విచారణ జరిపి నిజాన్ని నిగ్గుతేల్చాలని సరూర్‌నగర్ పోలీసులను కోరుతున్నారు.
 

©️ VIL Media Pvt Ltd.