Reading Time: 2 minutes
Megastar And Charan Those Two Are Fake Fans Are Happy

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లైనప్స్ గురించి సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ‘దసరా’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ చుట్టూ ఇండస్ట్రీలో ఒక క్రేజీ రూమర్ తెగ వైరల్ అవుతోంది. చిరంజీవితో శ్రీకాంత్ ఓదెల ఒక భారీ పీరియాడిక్ మాస్ డ్రామాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ పూర్తిగా ఆగిపోయిందంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. అంతేకాకుండా, చిరంజీవితో కాకుండా రామ్ చరణ్ హీరోగా శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను రీ-ప్లాన్ చేస్తున్నారనే సరికొత్త ప్రచారం కూడా మొదలైంది.

మెగా కాంబోల గురించి వస్తున్న ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఇండస్ట్రీ వర్గాలు స్పష్టం చేశాయి. ప్రస్తుతం చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ తమ తమ మునుపటి కమిట్మెంట్స్ తో ఎంతో బిజీగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బాబీ (కె.ఎస్. రవీంద్ర) దర్శకత్వంలో తన ప్రతిష్టాత్మక 158వ ప్రాజెక్ట్ చేస్తున్నారు . ఇటీవల ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాగా, వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి తీసుకురావడమే టార్గెట్ గా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నారు.

మరోవైపు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సైతం తన తదుపరి ప్రాజెక్ట్ తో బిజీగా గడుపుతున్నారు. నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా ఆయన ‘ది పారడైజ్’  అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ కమిట్మెంట్స్ అన్నీ పూర్తయిన తర్వాతే చిరంజీవి-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో అనుకున్న మెగా మాస్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది. కాబట్టి ఈ సినిమా ఆగిపోయిందనడంలో ఏమాత్రం వాస్తవం లేదు. ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే, ‘పెద్ది’ సినిమా షూటింగ్ తర్వాత ఆయన లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో తన 17వ చిత్రాన్ని (RC 17) చేయనున్నారు . ప్రస్తుతం సుకుమార్ ఈ ప్రాజెక్ట్ కోసం ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో నిమగ్నమయ్యారు. వీరి కాంబోలో వచ్చిన బ్లాక్‌బస్టర్ హిట్ ‘రంగస్థలం’ సినిమాను మించేలా ఈ కొత్త కథ ఉండబోతోందని టాక్. అంతా అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. మొత్తానికి చిరంజీవి, రామ్ చరణ్, శ్రీకాంత్ ఓదెల సినిమా గురించి నెట్టింట చక్కర్లు కొడుతున్న వార్తలన్నీ కేవలం ఫేక్ న్యూస్ మాత్రమేనని తేలిపోయింది.