Reading Time: < 1 minute
Israel Strikes Lebanon Hours After Us Iran Agreement

Israel : అంతర్జాతీయంగా దౌత్యపరమైన చర్చలు ఫలించి, ఇరాన్ – అమెరికా మధ్య కీలక ఒప్పందం ఖరారై 24 గంటలు కూడా గడవకముందే ప్రాంతీయ ఉద్రిక్తతలు మళ్లీ రాజుకున్నాయి. దక్షిణ లెబనాన్‌ లక్ష్యంగా ఇజ్రాయెల్ దళాలు మరోసారి విరుచుకుపడ్డాయి. ఇజ్రాయెల్ సైన్యం అక్కడ భారీస్థాయిలో వైమానిక, ఫిరంగి దాడులకు పాల్పడినట్లు లెబనాన్ వర్గాలను ఉటంకిస్తూ ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ‘ఐఆర్‌ఐబి’ (IRIB) వెల్లడించింది. దక్షిణ లెబనాన్‌లోని కీలక ప్రాంతాలైన జౌతార్, మార్కబా, ఖియామ్ నగరాలపై ఇజ్రాయెల్ ఏకకాలంలో దాడులు జరిపినట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. యుద్ధ విమానాలతో బాంబుల వర్షం కురిపించడంతో పాటు, సరిహద్దు వెంబడి ఫిరంగి దాడులతో ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడటంతో ఆయా ప్రాంతాల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పడానికి, కాల్పుల విరమణను పొడిగించడానికి ఒకవైపు అంతర్జాతీయంగా ముమ్మర దౌత్య ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఇజ్రాయెల్ దాడులకు తెగబడటం గమనార్హం. అయితే సరిహద్దు వెంబడి జరిగిన తాజా దాడుల్లో జరిగిన ప్రాణనష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. స్థానిక అధికారులు, లెబనీస్ మీడియా ప్రస్తుత పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రాంతీయ శాంతిని కాపాడేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు తాజా దాడులు గట్టి విఘాతంగా మారే ప్రమాదం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.