
చక్కెర తినడం మానేయండి…! ఇది చాలామంది సలహా. చాలామంది చక్కెర తినడం పూర్తిగా మానేశారు కూడా. బరువు తాగాలి అనుకునేవారు, షుగర్ వ్యాధి ఉన్నవారు చక్కెర తినడం మానేయాలని ప్రపంచవ్యాప్తంగా డాక్టర్స్ సూచిస్తున్నారు.అయితే… షుగర్ పూర్తిగా మానేయడం మంచిది కాదని ఓ పరిశోధనలో తేలింది. చికాగోలో జరిగిన ఎండోక్రైన్ సొసైటీ వార్షికోత్సవ సమావేశం ENDO 2026 లో సబ్మిట్ చేసిన ఒక రీసర్చ్ లో శరీరానికి బొత్తిగా సుక్రోజ్ అందకపోవడం వల్ల గట్ హెల్త్ దెబ్బ తింటుందని.. జీర్ణ సమస్యలు వస్తాయని తేలింది.
ఎలుకలపై చేసిన ప్రయోగంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు పరిశోధకులు. చక్కెర పూర్తిగా మానేస్తే మెటబాలిజంపై ఎలాంటి ప్రభావం పడుతుంది అనే కోణంలో ప్రయోగం చేశామని… అధిక చక్కెర వినియోగం హానికరం అయినప్పటికీ, కొన్ని రకాల చక్కెరలను పూర్తిగా తొలగించడం వలన ముఖ్యమైన జీవ ప్రక్రియలకు కూడా అంతరాయం కలగవచ్చని తేలిందని అన్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫ్రీ షుగర్స్ (ఆహారాలకు జోడించిన చక్కెరలు మరియు తేనె, సిరప్‌లు, పండ్ల రసాలలో సహజంగా ఉండేవి) ను మొత్తం రోజువారీ కేలరీలలో 10 శాతం కంటే తక్కువగా తీసుకోవాలని, 5 శాతం కంటే తక్కువ తీసుకోవడం ఉత్తమమని అంటున్నారు నిపుణులు.
స్టడీలో తేలింది ఇది:
కొన్ని ఎలుకలను రెండు గ్రూపులుగా విభజించి 16 వారాల పాటు జరిగిన ఈ పరిశోధనలో.. ఒక గ్రూప్ ఎలుకలకు సుక్రోజ్ ఉన్న లో ఫ్యాట్ ఫుడ్స్ అందించి.. మరో గ్రూప్ ఎలుకలకు ఏమాత్రం సుక్రోజ్ లేని లో ఫ్యాట్ ఫుడ్ అందించారు. ఈ ప్రాసెస్ షుగర్ ప్రభావం తెలుసుకునేందుకు ఎలుకలకు గ్లూకోజ్ రెసిస్టన్స్, ఇన్సులిన్ సెన్సిటివిటి వంటి టెస్ట్ లు చేసినట్లు తెలిపారు.
అయితే… సుక్రోజ్ లేని ఫుడ్ ఇచ్చిన ఎలుకల బరువులో పెద్దగా మార్పు లేకపోగా మెటాబాలిజంలో మార్పు కనపడిందని తెలిపారు పరిశోధకులు.సుక్రోజ్ తీసుకోని ఎలుకల బ్లడ్ షుగర్ లెవెల్స్ సరిగా లేకపోవడం, ఇన్సులిన్ నిరోధకత పెరగడం, గట్ మైక్రోబయోమ్‌లో అంతరాయాలు, ప్రేగు వాపు, ఫ్యాటీ లివర్ వ్యాధితో ముడిపడిన మార్పులు కనిపించాయని తెలిపారు .
తక్కువ కొవ్వు ఉన్న ఆహారం నుండి సుక్రోజ్‌ను పూర్తిగా తొలగించడం వలన పేగు ఆరోగ్యం ఊహించని విధంగా దెబ్బతిని, వాపు, జీవక్రియ లోపాలు ఏర్పడవచ్చని అంటున్నారు పరిశోధకులు. కేవలం చక్కెరను తొలగించడం కంటే సమతుల్య పోషణ చాలా ముఖ్యమని అంటున్నారు.
గట్ హెల్త్ ప్రాధాన్యత:
గట్ మైక్రోబయోమ్ అంటే జీర్ణవ్యవస్థలో నివసించే ట్రిలియన్ల కొద్దీ బ్యాక్టీరియా, శిలీంధ్రాలు మరియు ఇతర సూక్ష్మజీవులు. ఈ సూక్ష్మజీవులు జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి, జీవక్రియ, మొత్తం ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి.
ఊబకాయం, మధుమేహం, ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్, ఇంకా కొన్ని మానసిక ఆరోగ్య సమస్యల వంటి దీర్ఘకాలిక వ్యాధులను నివారించడానికి, పేగులోని బ్యాక్టీరియాను ఆరోగ్యకరమైన సమతుల్యతలో ఉంచుకోవడం అత్యవసరం అని నిపుణులు చెబుతున్నారు. సుక్రోజ్‌ను పూర్తిగా తొలగించడం ఈ సున్నితమైన సమతుల్యతను దెబ్బతీయవచ్చని స్టడీలో తేలింది.
చక్కెర రహిత ఆహారం తీసుకున్న ఎలుకలలో పేగులోని సూక్ష్మజీవుల సంఖ్యలో గణనీయమైన మార్పులను పరిశోధకులు గమనించారు. ఈ అంతరాయాలతో పాటు పేగులు, కాలేయంలో వాపు కూడా పెరిగిందని అంటున్నారు పరిశోధకులు., ఈ రెండూ మెటబాలిజంపై ప్రభావం చూపుతాయని అంటున్నారు. కాబట్టి షుగర్ పూర్తిగా మానేయకుండా…, నిపుణులు సూచించినట్లు తగిన మోతాదులో తీసుకుంటే మంచిది.