Reading Time: 2 minutes
కిడ్నీ వ్యాధి మరణాల్లో తెలంగాణనే టాప్! బాధితుల సంఖ్య పెరగడానికి కారణాలు ఇవే

తెలంగాణలో కిడ్నీ వ్యాధులు ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయి. రాష్ట్రంలో ప్రతి లక్ష మంది జనాభాలో 10,601 మంది దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి (సీకేడీ)తో బాధపడుతుండగా, 19 మంది వరకు మరణిస్తున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ వివరాలు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) ప్రచురించే ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో వెలువడ్డాయి. ‘గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్-2023’ గణాంకాల ఆధారంగా 1990 నుంచి 2023 వరకు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కిడ్నీ వ్యాధుల పరిస్థితిని ఢిల్లీలోని వైద్య నిపుణులు విశ్లేషించారు. ఈ అధ్యయనంలో తెలంగాణలో కిడ్నీ వ్యాధుల వల్ల సంభవిస్తున్న మరణాల రేటు, కోల్పోతున్న ఆరోగ్యకర జీవితకాలం దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే అధికంగా ఉన్నట్లు తేలింది.

రాష్ట్రంలో కిడ్నీ వ్యాధులు తీవ్రరూపం దాల్చడానికి మధుమేహం ప్రధాన కారణమని పరిశోధకులు గుర్తించారు. దేశవ్యాప్తంగా కిడ్నీ వ్యాధులకు మధుమేహం కారణమయ్యే శాతం 18 నుంచి 24 మధ్య ఉండగా, తెలంగాణలో అది మరింత ఎక్కువగా నమోదైంది. షుగర్‌ను సకాలంలో నియంత్రించకపోవడం వల్ల కిడ్నీలు వేగంగా దెబ్బతింటున్నాయని అధ్యయనం స్పష్టం చేసింది. కిడ్నీ వ్యాధుల కారణంగా అత్యల్ప మరణాల రేటు రాజస్థాన్‌లో ప్రతి లక్ష మందికి 6.71గా ఉండగా, తెలంగాణలో అది 19.84గా నమోదైంది. ఇది జాతీయ సగటుతో పోలిస్తే చాలా అధికం. అలాగే వైకల్యం, అకాల మరణాల కారణంగా కోల్పోతున్న ఉత్పాదక జీవిత సంవత్సరాల రేటులోనూ తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. రాజస్థాన్‌లో ఈ రేటు 312.2గా ఉండగా, తెలంగాణలో 666.38గా నమోదైంది.

గత మూడు దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా కిడ్నీ వ్యాధుల కొత్త కేసులు, మరణాల రేటు కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ తెలంగాణ, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉందని అధ్యయనం పేర్కొంది. ముఖ్యంగా పేద వర్గాల్లో మరణాలు అధికంగా ఉండటానికి వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించకపోవడం, అవగాహన లోపం కారణాలని వెల్లడించింది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు కిడ్నీ వ్యాధులను ప్రత్యేక ప్రజారోగ్య సమస్యగా గుర్తించి నిధులు కేటాయించాలని పరిశోధకులు సూచించారు. మధుమేహం, రక్తపోటు రోగులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలోనే క్రియాటినిన్‌, మూత్ర పరీక్షలు నిర్వహించాలని, పేదలకు డయాలసిస్‌, కిడ్నీ మార్పిడి సేవలు ఉచితంగా లేదా సులభంగా అందేలా వైద్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలని సిఫార్సు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి