Reading Time: 2 minutes
NEETలో మరో భారీ స్కామ్.. అడుగడుగునా విద్యార్ధుల సహనానికి అగ్నిపరీక్ష! రీఫండ్ నగదు హాంఫట్

హైదరాబాద్‌, జూన్‌ 16: నీట్-యూజీ పరీక్ష నిర్వహణలో ఇప్పటికే ప్రశ్నపత్రం లీకేజీ వివాదంతో విమర్శలు ఎదుర్కొంటున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి నీట్ రీ-ఎగ్జామ్‌కు సంబంధించిన రీఫండ్ ప్రక్రియలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. అధికారిక పోర్టల్‌లోకి అక్రమంగా చొరబడి 150 మందికి పైగా అభ్యర్థుల రీఫండ్ మొత్తాలను తన బ్యాంకు ఖాతాకు మళ్లించుకున్న 19 ఏళ్ల యువకుడిని అహ్మదాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

బిహార్‌లోని గయా జిల్లాకు చెందిన నవీన్ యాదవ్ అనే యువకుడు నీట్ రీఫండ్ పోర్టల్‌లోని భద్రతా లోపాలను లక్ష్యంగా చేసుకున్నాడు. గత నెలలో ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణల నేపథ్యంలో రద్దైన నీట్-యూజీ పరీక్షకు జూన్ 21న రీ-ఎగ్జామ్ నిర్వహించేందుకు ఎన్‌టీఏ ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో అభ్యర్థులకు ఫీజు రీఫండ్ అందించేందుకు ప్రత్యేక ఆన్‌లైన్ మాడ్యూల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ ప్రక్రియలో అభ్యర్థులు నమోదు చేసిన బ్యాంకు ఖాతా వివరాలను మార్చి రీఫండ్ మొత్తాలను తన ఖాతాకు మళ్లించేలా నవీన్ యాదవ్ పథకం రచించాడు. దర్యాప్తులో భాగంగా అతడు సుమారు 350 మంది అభ్యర్థుల ఖాతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. వారిలో 150 మందికి పైగా ఖాతాల్లోకి విజయవంతంగా ప్రవేశించి బ్యాంకు వివరాలను మార్చినట్లు వెల్లడించారు.

నిందితుడు ‘బ్రూట్ ఫోర్స్ అటాక్’ అనే సైబర్ దాడి పద్ధతిని ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు. ఈ విధానంలో పాస్‌వర్డ్‌లను ఊహిస్తూ అనేక కాంబినేషన్లను వరుసగా ప్రయత్నించడం ద్వారా ఖాతాల్లోకి ప్రవేశం పొందాడు. అనంతరం అభ్యర్థుల బ్యాంకు ఖాతాల స్థానంలో తన ఖాతా వివరాలను నమోదు చేసి, ఒక్కో అభ్యర్థికి చెల్లించాల్సిన రూ.1,700 రీఫండ్ మొత్తాన్ని తన ఖాతాలోకి జమ చేసుకున్నాడు. ఎన్‌టీఏ పోర్టల్‌లో రీఫండ్ లావాదేవీల్లో అసాధారణ మార్పులు గుర్తించిన అధికారులు అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ బ్రాంచ్‌కు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బ్యాంకు లావాదేవీలను విశ్లేషించి డబ్బు బదిలీలను ట్రాక్ చేశారు. దర్యాప్తు ఆధారంగా బిహార్‌లో ఉన్న నవీన్ యాదవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అహ్మదాబాద్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) శరద్ సింఘల్ మాట్లాడుతూ, పోర్టల్‌లోని భద్రతా లోపాలను నిందితుడు సద్వినియోగం చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. అతడు ఇతర సైబర్ నేరాల్లో కూడా పాల్గొన్నాడా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఈ ఘటనతో ఎన్‌టీఏ పోర్టల్ భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే ప్రశ్నపత్రం లీకేజీ వివాదంతో విమర్శలు ఎదుర్కొంటున్న సంస్థకు ఈ తాజా పరిణామం మరింత ఇబ్బందికరంగా మారింది.