Reading Time: 3 minutes

మాన్సూన్ మాయం ..దేశ భూభాగంపై జాడ లేకుండా పోయిన రుతుపవనాలు ..

Caption of Image.
  • మాన్సూన్​ మాయం
  • దేశ భూభాగంపై జాడ లేకుండా పోయిన రుతుపవనాలు
  • పశ్చిమ దిశ నుంచి గాలులు వేగంగా వీస్తుండడమే కారణం?
  • రుతుపవనాలు బలం పుంజుకునేందుకు మరో వారం పట్టే చాన్స్​
  • మన రాష్ట్రంలో 12వ తేదీ నుంచి స్తంభించిన రుతుపవనాలు
  • రాష్ట్రంలో 20 శాతం లోటు వర్షపాతం.. నాలుగు జిల్లాల్లో తీవ్రం
  • మూడు రోజులు రాష్ట్రంలో హీట్​ వేవ్స్​.. ఎల్లో అలర్ట్​ జారీ

హైదరాబాద్​, వెలుగు:  దేశంపై ఎల్​నినో ఎఫెక్ట్​ మొదలైనట్లే కనిపిస్తున్నది. ఇందుకు సంకేతంగా నైరుతి రుతుపవనాలు మాయమయ్యాయి.  దేశ భూభాగంపై జాడ లేకుండా పోయాయి. రుతుపవనాల విస్తరణకు అంతా అనుకూలంగా ఉందని వాతావరణశాఖ చెప్తూ వచ్చినప్పటికీ  ఒక్కసారిగా సీన్​ మారిపోయింది. పరిస్థితి కొంచెం తీవ్రంగానే ఉందని  ఐఎండీ ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. రెండు రకాల గాలుల మధ్య టగ్​ ఆఫ్​ వార్​ లాంటి పరిస్థితులు నెలకొనడంతో రుతుపవనాల విస్తరణపై ప్రభావం పడుతున్నదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. పడమటి నుంచి తేమను మోసుకొచ్చే పశ్చిమ గాలులు, వర్షాలు కురిపించేందుకు అనువుగా ఉండే తూర్పు గాలుల మధ్య ‘తోపులాట’ లాంటి పరిస్థితులే ఇందుకు కారణమంటున్నారు. పశ్చిమగాలులు పూర్తిగా దక్షిణంవైపు వచ్చేశాయని, సాధారణ స్పీడ్​ కన్నా ఎక్కువ వేగంతో ముందుకు కదులుతున్నాయని వివరిస్తున్నారు. అదే సమయంలో రుతుపవనాల విస్తరణకు తోడ్పాటునిస్తూ, ఎక్కువ వర్షాలకు కారణమయ్యే తూర్పు గాలుల దిశను వేగంగా వస్తున్న పశ్చిమ గాలులు అడ్డుకుంటున్నాయని అధికారులు చెబుతున్నారు.

రుతుపవనాలను బలపరిచి.. దేశవ్యాప్తంగా వర్షాలు కురిసేలా తూర్పుగాలులు పనిచేస్తుంటాయి. ప్రస్తుతం పశ్చిమగాలులు తూర్పు పవనాలను అడ్డుకుంటుండడంతో.. తూర్పు పవనాల ప్రభావం కనిపించడం లేదు. అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో సరిపోయేంత తేమ ఉన్నా కూడా.. వెస్టర్లీస్​, ఈస్టర్లీస్​ మధ్య నెలకొన్న ‘ఫైట్​’ లాంటి పరిస్థితులతో రుతుపవనాలు ముందుకు కదలడం లేదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రభావంతోనే మన తెలంగాణతో పాటు మధ్య భారత రాష్ట్రాల్లో వర్షాల లోటు ఏర్పడిందని అంటున్నారు. ఈ వారందాటితేగానీ రుతుపవనాలు బలపడే అవకాశం కనిపించడం లేదని అధికారులు చెబుతున్నారు.  ఇక, వచ్చే మూడు రోజుల పాటు రాష్ట్రంలో హీట్​వేవ్స్​ పరిస్థితులే ఉంటాయని ఐఎండీ వార్నింగ్​ ఇచ్చిందంటే.. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆదిలాబాద్​, కుమ్రంభీం ఆసిఫాబాద్​, మంచిర్యాల, నిర్మల్​, నిజామాబాద్​, జగిత్యాల, జయశంకర్​ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తీవ్రత ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణశాఖ వెల్లడించింది. అదే సమయంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని  పేర్కొంది. ఎల్లో అలర్ట్​జారీ చేసింది. 

రాష్ట్రంలో 20శాతం లోటు వర్షపాతం..

రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల్లోనూ లోటు వర్షపాతమే నమోదైంది. ఈపాటికి 63 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా.. కేవలం 51 మిల్లీమీటర్ల వర్షపాతానికే పరిమితమైంది. దాదాపు 20 శాతం లోటు కనిపిస్తున్నది. 19 జిల్లాల్లో 50 శాతానికిపైగానే లోటు ఉన్నది. హనుమకొండలో 77 శాతం లోటు వర్షపాతం నమోదైంది. హనుమకొండతో పాటు పెద్దపల్లి, జగిత్యాల, సిద్దిపేట జిల్లాల్లో వర్షపాత లోటు అత్యంత ఎక్కువగా ఉన్నది.  జూలైలో పరిస్థితి ఏమైనా మారే అవకాశాలుంటాయా అన్నది వేచి చూడాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా, రాష్ట్రంలో మళ్లీ ఉష్ణోగ్రతలు, ఎండ మంట, ఉక్కపోత తీవ్రమవుతున్నాయి. ప్రత్యేకించి ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మళ్లీ ఎండల ప్రభావం తీవ్రమైంది. మంచిర్యాల జిల్లాలో అత్యధికంగా 43 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. కామారెడ్డి, నిర్మల్​, నిజామాబాద్​, ఆదిలాబాద్​, ఆసిఫాబాద్​, జగిత్యాల, కరీంనగర్​, సిద్దిపేట, పెద్దపల్లి, హనుమకొండ, జయశంకర్​ భూపాలపల్లి, ములుగు, వరంగల్​, మహబూబాబాద్​, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లోనూ 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మొత్తంగా 19 జిల్లాల్లో ఎండల ప్రభావం కనిపించింది. మన ప్రాజెక్టులు నిండేందుకు అత్యంత కీలకమైన మహారాష్ట్రలో వర్షపాతలోటు 65 శాతంగా ఉంది. 55 మిల్లీమీటర్ల వర్షం పడాల్సి ఉన్నా.. కేవలం 19 మిల్లీమీటర్లే కురిసింది. మాన్సూన్​ ఎంటరైన ఈశాన్య, తూర్పు రాష్ట్రాల్లోనూ 40 శాతం వరకు వర్షపాత లోటు ఉన్నది. 120 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉన్నా.. అక్కడ కూడా 77 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ప్రస్తుత పరిస్థితులపై రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా, వర్షాలు మొదలయ్యాకే విత్తనాలు వేయాలని, ముందే వేస్తే ఎండలకు మాడిపొయ్యే ప్రమాదముందని వ్యవసాయ అధికారులు  హెచ్చరిస్తున్నారు.

రుతుపవనాలు ఏడియాడనే.. 

మామూలుగా అయితే రుతుపవనాలు జూన్​ 1 నాటికి కేరళ తీరం నుంచి దేశంలోకి ప్రవేశిం చి.. జులై తొలి వారం నాటికే దేశవ్యాప్తంగా విస్తరిస్తుంటాయి. కానీ, ఈ సారి రుతుపవ నాలు ఈ నెల 4న కేరళలోకి ప్రవేశించాయి. తొలి రెండు మూడు రోజులు చాలా వేగంగా దక్షిణాదిలోని పలు రాష్ట్రాలకు విస్తరించాయి. మన రాష్ట్రంలోకి ఈ నెల 8న ప్రవేశించాయి. గద్వాల, నారాయణపేట జిల్లాల మీదుగా రాష్ట్రంలోకి వచ్చినా.. మూడు రోజులు స్తంభిం చిపోయాయి. మళ్లీ ఈ నెల 12న సెంట్రల్​, తూర్పు జిల్లాలకు విస్తరించాయి. అంతే, ఆ రోజు నుంచి మళ్లీ అంగుళం కూడా రుతుప వనాలు ముందుకు కదల్లేదు. రుతుపవనాల విస్తరణకు కీలకమైన నార్త్​ పాయింట్​ రాష్ట్రంలో ని భద్రాచలం, హైదరాబాద్​ మీదుగా వెళ్తున్నా..  మరింత ముందుకు కదిలేందుకు మాత్రం అనుకూలమైన పరిస్థితులు కనిపించడం లేదని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాలంటే మరో ఐదు రోజులైనా పడుతుందని వివరిస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.