
హైదరాబాద్: ఓటర్ ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) విషయంలో ఎవరూ బాధ్యతారహితంగా వ్యవహరించొద్దని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచించారు. మంగళవారం (జూన్ 16) మునుగోడు క్యాంపు కార్యాలయంలో ఓటర్ ప్రత్యేక సమగ్ర సవరణ (S.I.R)పై కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లు, బీఎల్‌వోలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏఐసీసీ కోఆర్డినేటర్ రుద్ర సంతోష్, డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాస్ నేత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. మునుగోడులో ఓటు విలువ పెరిగిందని.. ఓటుకు ఫుల్ డిమాండ్ ఉందని అన్నారు. ఇతర ప్రాంతాల్లో ఓటు ఉన్నవారు కూడా మునుగోడులో ఓటు కోసం కావాలనేలా ప్రత్యేక బ్రాండ్ ఏర్పడిందని పేర్కొన్నారు.
సర్ ప్రక్రియలో అర్హుల ఓటు ఒక్కటి కూడా పోకుండా బీఎల్‌ఏలు సీరియస్‌గా పనిచేయాలని సూచించారు. ఓటు అనేది సామాన్యుడి చేతిలో ఉన్న వజ్రాయుధమన్నారు. ప్రాంతం అభివృద్ధి జరగాలంటే మంచి నాయకుడిని ఎన్నుకోవాలని.. మంచి నాయకుడిని ఎన్నుకోవాలంటే ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండాలని సూచించారు.