గ్రహ సంచారంలో 3, 11 స్థానాలు అనుకూలంగా ఉండే పక్షంలో శీఘ్ర పురోగతికి బాగా అవకాశం ఉంటుంది. తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందగలుగుతారు. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సక్సెస్ అవుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా అనుభవానికి వస్తాయి. ప్రస్తుత గ్రహ సంచారం వల్ల మేషం, వృషభం, కర్కాటకం, సింహం, కన్య, మీన రాశుల వారికి ఆగస్టు చివరి వరకు కొద్ది ప్రయత్నంతో పురోగతి చెందడానికి అవకాశం ఉంది. ఆదాయం, కెరీర్, వృత్తి, వ్యాపారాలు, విదేశీ ప్రయత్నాలు, ఆరోగ్యం వంటివి బాగా పురోగతి చెందే అవకాశం ఉంది.
మేషం: ఈ రాశికి తృతీయ స్థానంలో తృతీయాధిపతి బుధుడు, లాభ స్థానంలో రాహువు సంచారం వల్ల కెరీర్ పరంగా శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది. ప్రయాణాలు లాభిస్తాయి. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయ వృద్ధి, ఉద్యోగం, పెళ్లి, సొంత ఇల్లు వంటి విషయాల్లో ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది. ప్రయత్న లోపం ఉండని పక్షంలో ఆర్థికంగా బాగా ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. ఉద్యోగంలో తప్పకుండా అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగుతాయి.
వృషభం: ఈ రాశికి తృతీయ స్థానంలో గురువు ఉచ్ఛ స్థితిలో, శుక్రుడితో కలిసి ఉండడం, లాభ స్థానంలో ఈ రాశికి అత్యంత శుభుడైన శనీశ్వరుడి సంచారం వల్ల ఈ రాశివారు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ ప్రయత్నం చేపట్టినా విజయం సిద్ధిస్తుంది. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలకు డిమాండ్ బాగా పెరుగుతుంది. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
కర్కాటకం: ఈ రాశికి లాభ స్థానంలోకి త్వరలో ప్రవేశిస్తున్న కుజుడి వల్ల ఈ రాశివారికి తప్పకుండా ఉద్యోగంలో అంచనాల్ని మించిన పురోగతి ఉంటుంది. తృతీయ స్థానం మీద శని వీక్షణ వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆగస్టు ద్వితీయార్థం నాటికి వీరికి ఆర్థికంగా, కెరీర్ పరంగా స్థిరత్వం లభిస్తుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు కలలో కూడా ఊహించని ఆఫర్ అందుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.
సింహం: ఈ రాశికి లాభ స్థానంలో ఈ రాశికి దన, లాభాధిపతి అయిన బుధుడి సంచారం వల్ల ఈ రాశివారు ఏ రంగంలో ఉన్నా శీఘ్రంగా పురోగతి చెందడానికి అవకాశం ఉంది. ఈ రాశికి తృతీయ స్థానం మీద కుజుడి దృష్టి వల్ల ఆదాయానికి ఏమాత్రం లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రయాణాల వల్ల బాగా లాభపడతారు. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ సంపాదన యోగం కలుగుతుంది.
కన్య: ఈ రాశికి లాభ స్థానంలో గురువు ఉచ్ఛ స్థితిలో సంచారం చేస్తున్నందువల్ల అక్టోబర్ 31 వరకు ఈ రాశివారి ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఉద్యోగంలోనే కాక, వృత్తి, వ్యాపారాల్లో కూడా అంచనాలకు మించిన పురోభివృద్ధి ఉంటుంది. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు బాగా వృద్ధిలోకి వస్తారు. నిరుద్యోగులకు ఆశించిన విదేశీ ఆఫర్లు అందుతాయి.
మీనం: ఈ రాశికి తృతీయ స్థానంలో త్వరలో కుజుడి సంచారం, లాభ స్థానం మీద ఉచ్ఛ గురువు, శుక్రుడి దృష్టి వంటి కారణాల వల్ల ఈ రాశివారు ఏ రంగంలో ఉన్నా అంచనాలను మించిన పురోగతి ఉంటుంది. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. పిల్లలు వృద్ధిలోకి రావడం, సంతాన ప్రాప్తి కలగడం వంటివి జరుగుతాయి.






