
న్యూఢిల్లీ: కర్నాటక క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ రోహిణి సింధూరి, ఐపీఎస్ ఆఫీసర్ డి. రూప మౌడ్గిల్ మధ్య గత కొంతకాలంగా కొనసాగుతున్న పరువు నష్టం వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది. శుక్రవారం ఈ కేసును జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ సంజీవ్ సచ్‌దేవాతో కూడిన బెంచ్ విచారించింది. దీర్ఘకాలంగా సాగుతున్న ఈ న్యాయపోరాటం ఇద్దరు సీనియర్ సివిల్ సర్వెంట్ల కెరీర్‌ను దెబ్బతీస్తోందని వ్యాఖ్యానించింది.
వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్‌ను మధ్యవర్తిగా నియమించింది. ‘‘సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్‌ను మధ్యవర్తిగా నియమిస్తున్నాం. ఇరుపక్షాలు హాజరుకావాలి. ఈ వ్యవహారంలో ఇరుపక్షాల మధ్య ఉన్న రెండు కేసుల తదుపరి విచారణలపై స్టే విధిస్తున్నాం’’ అని పేర్కొంది.
వివాద నేపథ్యమిదీ
రోహిణి సింధూరి, రూప మౌడ్గిల్ మధ్య 2023లో బహిరంగంగా చోటు చేసుకున్న ఆరోపణలు, ప్రత్యారోపణలు చివరకు ఒకరిపై ఒకరు పరువు నష్టం దావాలు వేసుకునే స్థాయికి చేరాయి. రూప మౌడ్గిల్ దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం కేసు విచారణను సవాల్ చేస్తూ రోహిణి సింధూరి వేసిన పిటిషన్‌ను కర్నాటక హైకోర్టు గతంలో కొట్టివేసింది. ట్రయల్ కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించడంతో, రోహిణి సింధూరి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా సుప్రీంకోర్టు ఈ వివాదాన్ని మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకోవాలని సూచించింది.