
YS Jagan For Aqua Farmers: రాష్ట్రంలో రైతులు, ముఖ్యంగా ఆక్వా రైతులు అత్యంత దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో రైతులు, ఆక్వా రైతులు సంతోషంగా ఉండేలా ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఆయన పేర్కొన్నారు. రైతులను చేయిపట్టుకుని నడిపించే వ్యవస్థలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 10 వేలకుపైగా రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) ఏర్పాటు చేశామని జగన్ గుర్తుచేశారు. అలాగే ఆక్వా రైతులకు సేవలు అందించేందుకు 35 ఆక్వా ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌లు, 782 ఆర్బీకేల్లో ఫిషరీస్ అసిస్టెంట్లను నియమించామని తెలిపారు.
ఆక్వా రంగాన్ని బలోపేతం చేయడానికి అప్సడా చట్టాన్ని తీసుకొచ్చామని, ముఖ్యమంత్రినే దానికి ఛైర్మన్‌గా నియమించామని చెప్పారు. రైతులకు నష్టం కలిగించే సిండికేట్ వ్యవస్థకు తమ హయాంలో అవకాశం లేకుండా చేశామని అన్నారు. ఎన్నికల హామీ మేరకు ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్‌ను రూ.1.50కే అందించామని, 57 నెలల్లో రూ.3,306 కోట్లను విద్యుత్ సబ్సిడీగా చెల్లించామని వెల్లడించారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో యూనిట్ విద్యుత్‌కు రూ.3.85 వసూలు చేశారని, చివరి ఆరు నెలల్లో రూ.2కు ఇస్తానంటూ జీవో విడుదల చేసినప్పటికీ అమలు విషయంలో చిత్తశుద్ధి చూపలేదని జగన్ విమర్శించారు. అంతేకాకుండా అప్పటి ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.340 కోట్ల బకాయిలను కూడా తమ ప్రభుత్వమే చెల్లించిందని పేర్కొన్నారు.
తమ ప్రభుత్వ కాలంలో ఆక్వా రంగం గణనీయంగా అభివృద్ధి చెందిందని జగన్ తెలిపారు. 2018-19లో 38 లక్షల టన్నులుగా ఉన్న రొయ్యలు, మత్స్య ఉత్పత్తులు 2022-23 నాటికి 51 లక్షల టన్నులకు పెరిగాయని చెప్పారు. అలాగే 2021-22, 2022-23 సంవత్సరాల్లో రాష్ట్రానికి రెండు సార్లు బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డులు వచ్చాయని గుర్తుచేశారు. ఆక్వా ఫీడ్ కంపెనీలు ధరలు పెంచినప్పుడు మూడు సార్లు వెనక్కి తగ్గేలా చర్యలు తీసుకున్నామని జగన్ తెలిపారు. 2018-19లో రూ.13,855 కోట్ల విలువైన 2.61 లక్షల టన్నుల ఆక్వా ఎగుమతులు జరగగా, 2022-23 నాటికి అవి రూ.19,847 కోట్ల విలువైన 3.28 లక్షల టన్నులకు పెరిగాయని చెప్పారు.
ప్రస్తుతం ఆక్వా ఫీడ్, సీడ్, ప్రాసెసింగ్ యూనిట్లు అన్నీ ఒక సిండికేట్‌గా వ్యవహరిస్తూ రైతులకు నష్టం చేస్తున్నాయని జగన్ ఆరోపించారు. పంట చేతికి వచ్చే సమయానికి కొనుగోలు ధరలను తగ్గిస్తున్నారని, పెట్టుబడి ఖర్చులు భారీగా పెరిగినా రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని అన్నారు. 100 కౌంట్ రొయ్యల ఉత్పత్తికి రూ.270 వరకు ఖర్చవుతుండగా, మార్కెట్‌లో రూ.220 నుంచి రూ.240 మాత్రమే ఇస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫీడ్ ధరలను కిలోకు రూ.4 పెంచారని, జూన్‌లో మరో రూ.10 నుంచి రూ.12 వరకు పెంచారని జగన్ విమర్శించారు. ఆక్వా రైతుల తరఫున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోందని, ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నెలాఖరు లోపు పెంచిన ఫీడ్ ధరలను తగ్గించాలని కూటమి ప్రభుత్వానికి జగన్ అల్టిమేటం జారీ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే జులై 1 లేదా 2 తేదీల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే ఆందోళన కార్యక్రమంలో తాను స్వయంగా పాల్గొంటానని ప్రకటించారు. ఆక్వా రైతుల సమస్యలపై బహిరంగ సభ నిర్వహించి వారి తరఫున పోరాటం చేస్తానని స్పష్టం చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్..