
- మున్సిపాలిటీల్లో 24 వేల మంది పేర్లపై తీసుకుంటున్నట్లు గుర్తింపు
- అర్బన్‌లో నిర్వహించిన జీవన్ ప్రమాణ్ సర్వేలో వెలుగులోకి
- మృతి చెందిన వారి పింఛన్ల తొలగింపు
- రాష్ట్రంలో19.04 లక్షల మంది లబ్ధిదారులకు లైవ్ నెస్ అథెంటికేషన్
- ఇప్పటివరకు 15 లక్షల మందికిపైగా వివరాల సేకరణ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో చనిపోయిన వారికి చేయూత పింఛన్లు అందజేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అర్బన్ ఏరియాలో నిర్వహించిన ‘జీవన్ ప్రమాణ్’ సర్వేలో ఈ విషయంలో వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో ‘చేయూత’ పింఛన్ల పంపిణీలో పారదర్శకత కోసం మున్సిపాలిటీల్లో చేపట్టిన ‘లైవ్ నెస్ అథెంటికేషన్’(జీవన్ ప్రమాణ్) స్పెషల్ డ్రైవ్ సోమవారంతో ముగిసింది. అనర్హులు, చనిపోయినవారి పేర్లు తొలగించే లక్ష్యంతో ఈ ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు.
ఇప్పటివరకు నిర్వహించిన ఈ డ్రైవ్‌లో కేవలం మున్సిపాలిటీల పరిధిలోనే సుమారు 24 వేల మంది లబ్ధిదారులు మృతి చెందినప్పటికీ పింఛన్లు పొందుతున్నట్లు అధికారులు ప్రాథమికంగా తేల్చారు. వారి పింఛన్లను తొలగించి కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు చేయూత అందించనున్నారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో కలిపి మొత్తం 19.04 లక్షల మంది చేయూత పింఛన్‌దారుల వివరాలు సేకరించాలనే లక్ష్యంతో ఈ లైవ్‌నెస్ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.
మే15న ఈ కార్యక్రమం ప్రారంభం కాగా.. సోమవారం నాటికి 15 లక్షల మందికిపైగా వెరిఫికేషన్ పూర్తిచేశారు. ఇంకా 3.87 లక్షల మందికి వెరిఫికేషన్ చేయాల్సి ఉంది. కాగా, క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్న సిబ్బందికి కొన్నిచోట్ల సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతుండటం, మరికొన్ని చోట్ల లబ్ధిదారులు అందుబాటులో లేకపోవడం, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం, సర్వే సమయంలో ఇండ్లకు తాళాలు వేసి ఉండడం, ఇంకొన్ని చోట్ల రాజకీయ ఒత్తిళ్ల కారణంగా డ్రైవ్ నెమ్మదిగా సాగుతోంది. ఈ నేపథ్యంలో గడువును మరికొన్ని రోజులు పొడిగించే అవకాశముందని ఆఫీసర్లు చెప్తున్నారు.
ఉత్తర తెలంగాణలో 95 శాతానికి సర్వే పూర్తి..
ఉత్తర తెలంగాణ జిల్లాలు 95 శాతానికి జీవన్ ప్రమాణ్ సర్వే పూర్తయింది. ఈ సర్వేలో హైదరాబాద్ పరిసర జిల్లాలు వెనుకంజలో ఉన్నాయి. మంచిర్యాల, బెల్లంపల్లి, జగిత్యాల జిల్లాలు 99 శాతం సర్వే పూర్తి చేసి రాష్ట్రంలోనే టాప్ ప్లేస్‌లో నిలిచాయి. రంగారెడ్డి, మేడ్చల్, ఖమ్మం జిల్లాలు వెనుకంజలో ఉన్నాయి. మున్సిపాలిటీల్లో లబ్ధిదారుల ఇండ్లకు తాళాలు వేసి ఉండటం, అడ్రస్‌లు మారడం వంటి కారణాలతో ఇక్కడ డ్రైవ్ ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. ఇంకా 3.87 లక్షల మందికి ‘లైవ్ నెస్ అథెంటికేషన్’ చేయాల్సి ఉంది. ఎవరూ పింఛన్ కోల్పోకూడదనే ఉద్దేశంతో అర్హులైన ప్రతి ఒక్కరి లైవ్‌నెస్ ధృవీకరణ పూర్తయ్యే వరకు ఈ ప్రక్రియను కొనసాగించాలని భావిస్తున్నారు.
ఇకపై అంతా ఆన్‌లైనే..
పింఛన్ల పంపిణీలో అక్రమాలకు తావులేకుండా ఇకపై ‘చేయూత’ పింఛన్లను పూర్తిగా ఆన్‌లైన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో ఈ కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసి, నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే నగదు జమ చేసేలా పక్కా ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే కొన్ని చోట్ల బ్యాంకు, ఫోస్ట్ ఆఫీస్‌ల ద్వారా నగదు లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతుంది.
రాష్ట్రవ్యాప్తంగా 41.20 లక్షల పింఛన్లు..
రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 41.20 లక్షల మందికి ప్రభుత్వం పింఛన్లను అందజేస్తున్నది. చనిపోయినవారు, అనర్హులు పింఛన్లు పొందుతున్నారని ఫిర్యాదులు అందడంతో ప్రతి పింఛన్‌దారుల గుర్తింపు కోసం లైవ్‌నెస్ అథెంటిఫికేషన్ యాప్ విధానం తీసుకొచ్చింది. ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో పోస్ట్ ఆఫీస్‌ల ద్వారా అందించే పింఛన్లు ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్(ఎఫ్‌ఆర్‌ఎస్), బయోమెట్రిక్ ద్వారా ఇస్తున్నారు. బ్యాంకుల్లో పింఛన్ తీసుకునే వారికి ప్రతి నెలా సాంకేతిక తనిఖీలు లేకుండానే ఖాతాలో జమవుతున్నాయి.
ఇందులో ఎక్కువగా మరణించిన వారు, జిల్లా నుంచి వెళ్లిపోయిన వారి ఖాతాల్లోనూ డబ్బులు జమవుతున్నాయి. వాటిని ఇతరులు తీసుకుంటున్న సందర్భాలు వెలుగు చూశాయి. ఎక్కువగా మున్సిపాలిటీల్లో చనిపోయినవారి పేరిట పింఛన్లు పొందుతున్నట్లు తేలింది. ఈ క్రమంలోనే సాంకేతిక ఆధారంగా పింఛన్ డబ్బులు అందించేలా చర్యలు చేపట్టింది. ఎఫ్‌ఆర్‌ఎస్ విధానంతో బతికి ఉంటేనే పింఛన్ డబ్బులు పొందే చాన్స్ ఉంది.