Reading Time: 2 minutes
చిన్న పాన్ షాప్.. రూ.1.85 లక్షల కరెంట్ బిల్! భయంతో ఆత్మహత్య

ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ జిల్లా సైద్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మురాద్‌చక్ గ్రామంలో చోటుచేసుకున్న విషాదకర ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అధిక విద్యుత్ బిల్లు, భారీ జరిమానాలు, అధికారుల నిరంతర ఒత్తిడితో మనస్తాపానికి గురైన పాన్ షాప్ యజమాని సురేంద్ర కశ్యప్ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి వద్ద లభించిన సూసైడ్ నోట్ ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం పనితీరుపై తీవ్ర చర్చకు దారితీస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సుమారు ఏడాది క్రితం విద్యుత్ శాఖ విజిలెన్స్ బృందం సురేంద్ర నిర్వహిస్తున్న చిన్న దుకాణంపై తనిఖీలు నిర్వహించింది.

కనికరించని అధికారులు..

ఈ సందర్భంగా విద్యుత్ వినియోగానికి సంబంధించిన ఉల్లంఘనల పేరుతో అతనిపై సుమారు రూ.1.12 లక్షల జరిమానా విధించారు. బకాయి బిల్లులు కూడా కలిపి చెల్లించాలని ఆదేశించారు. అనంతరం ఈ కేసు తహసీల్ కార్యాలయానికి చేరడంతో రికవరీ సర్టిఫికేట్ (ఆర్‌సీ) జారీ అయింది. దీంతో బకాయి మొత్తం దాదాపు రూ.1.85 లక్షలకు పెరిగినట్లు తెలుస్తోంది. ఈ భారీ మొత్తాన్ని చెల్లించే స్థోమత లేకపోయినా, బిల్లును తగ్గించాలని సురేంద్ర పలుమార్లు విద్యుత్ శాఖ, రెవెన్యూ అధికారులను ఆశ్రయించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే వారు కనికరించకపోగా, డబ్బు చెల్లించాలని అధికారులు తరచూ ఒత్తిడి చేశారు. దుకాణం మూసివేస్తామని హెచ్చరిస్తూ పలుమార్లు వచ్చి వేధించారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

నేను చనిపోతే..

మృతుడి భార్య జ్ఞానతి తెలిపిన వివరాల ప్రకారం.. సురేంద్ర గత కొంతకాలంగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. “నేను చనిపోతే ఈ బిల్లుల సమస్య ముగుస్తుంది” అని తరచూ బాధపడేవాడని ఆమె కన్నీటి పర్యంతమైంది. ఇద్దరు కుమార్తెల భవిష్యత్తు, వారి వివాహాల బాధ్యతలు, అప్పుల భారం, అధికారుల ఒత్తిడి కలిసి అతన్ని తీవ్ర నిరాశలోకి నెట్టాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఘటనతో గ్రామస్థులు విద్యుత్ శాఖ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు, అధికారుల పాత్రపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సూసైడ్ నోట్‌లోని వివరాలు, కుటుంబ సభ్యుల ఆరోపణలను పరిశీలిస్తూ ఘటన వెనుక పూర్తి వాస్తవాలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రశ్న: విద్యుత్ బిల్లు ఎక్కువగా వస్తే ఫిర్యాదు చేయవచ్చా?

జవాబు: అవును

ప్రశ్న: విద్యుత్ బిల్లు ఎక్కువగా వస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలి?

జవాబు: జాతీయ టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 1912