Reading Time: 2 minutes
South Indian Movies Releasing This Week Samanthas Maa Inti Bangaram Leads June 19 Releases

Theatre Releases June 2026 : ఈ వారం దక్షిణాది చిత్రసీమ ప్రేక్షకులకు నిజంగానే ఒక చిన్న సినీ పండుగలా మారబోతోంది. ఒకవైపు స్టార్ హీరోల భారీ చిత్రాలు, మరోవైపు కొత్త కథలతో వస్తున్న ప్రయోగాత్మక సినిమాలు, ఇంకోవైపు హారర్, థ్రిల్లర్, రొమాన్స్, సోషల్ డ్రామా వంటి విభిన్న జానర్లతో జూన్ 19న థియేటర్లకు సందడి తీసుకురానుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమాలు ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్ అందించనున్నాయి. ఈ వారం ఏ సినిమా చూడాలి అనే సందేహంలో ఉన్న సినీ అభిమానులకు ఆసక్తికరమైన ఆప్షన్లు కూడా సిద్ధంగా ఉన్నాయి.

ఇప్పుడు అందరి దృష్టి ఎక్కువగా సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ పై పడింది. తమిళంలో ‘ఎంగల్ తంగం’ పేరుతో విడుదలవుతున్న ఈ మూవీని నందిని రెడ్డి తెరకెక్కించారు. ఒక మిడిల్ క్లాస్ కుటుంబంలోకి అడుగుపెట్టిన కొత్త కోడలు ఎదుర్కొనే సంఘటనల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఈ సినిమా సమంత కెరీర్‌లో మరో ప్రత్యేక చిత్రంగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

హారర్ కామెడీ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకుల కోసం ‘చెట్టు మీద దయ్యం నాకేం భయం’ సిద్ధమైంది. పరిశోధన కోసం ఒక ఫామ్ హౌస్ కి వెళ్లిన యువకులు ఎదుర్కొనే వింత సంఘటనల చుట్టూ ఈ కథ నడుస్తుంది. భయంతో పాటు వినోదాన్ని అందించే ప్రయత్నంగా ఈ చిత్రం కనిపిస్తోంది. తల్లాడ సాయికృష్ణ ఈ సినిమాకి హీరో పాత్రతో పాటు దర్శకత్వ బాధ్యతను కూడా నర్వహించారు.

ఇక కన్నడ చిత్రసీమ నుంచి వస్తున్న ‘డోడ్మాన్సా’ కూడా ఆసక్తికరమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నటుడు కావాలని కలలు కనే ఓ గ్రామీణ యువకుడి ప్రయాణం, అతని ప్రేమకథ, సినిమా ప్రపంచంలో నిలబడేందుకు చేసే పోరాటంతో ఈ కథ ఉంటుంది.

తమిళ నటుడు విజయ్ ఆంటోని నటించిన ‘నూరు సామి’ కూడా ఈ నెల 19 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది సోషల్ మెసేజ్ ఇచ్చే ఎమోషనల్ కంటెంట్ తో రాబోతోంది. మరోవైపు మలయాళ చిత్రం ‘బాలన్ ది బాయ్’ ఒక టీనేజ్ బాలుడు తన అదృశ్యమైన తల్లిని వెతుక్కుంటూ చేసే ప్రయాణాన్ని సైకాలజికల్ థ్రిల్లర్ రూపంలో చెప్పబోతోంది.

ఈ వారం ప్రత్యేకంగా చర్చకు వస్తున్న మరో చిత్రం ‘LGBT: ఒక న్యాయ పోరాటం’. ట్రాన్స్‌జెండర్ మహిళ గౌరవం కోసం చేసే పోరాటాన్ని చూపించే ఈ చిత్రం సామాజిక అంశాలను బలంగా ప్రస్తావించబోతోంది. ఇటీవలి కాలంలో ఇలాంటి కథలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో ఈ సినిమాపై కూడా ఆసక్తి నెలకొంది.

అలాగే ‘మను’, ‘త్రిమూర్తులు బదిలీ’, ‘చిన్న చిన్న ఆసై’, ‘దీవానా’ వంటి చిత్రాలు కూడా తమ తమ కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఈ నెల 19 న సిద్ధమయ్యాయి. ముఖ్యంగా ‘త్రిమూర్తులు బదిలీ’లో నిజాయితీగల కానిస్టేబుల్ పాత్ర, ‘చిన్న చిన్న ఆసై’లో వారణాసి నేపథ్యంలోని ఎమోషన్, ‘దీవానా’లో వన్ సైడ్ ప్రేమ కథ ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్ ఇవ్వబోతున్నాయి.