
ప్రతీఒక్కరి ఇంట్లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఇటీవల డొమెస్టిక్ సిలిండర్ ధరలు రూ.30 మేర పెరగడంతో సామాన్యులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మార్చిలో రూ.60 పెంచగా.. ఇటీవల మరోసారి పెంచడంతో సామాన్యులపై భారం పడుతోంది. ఇది ఇలా ఉంచితే సిలిండర్‌పై అనేక గుర్తులు ఉంటాయి. కొన్ని ఆక్షరాలు, నెంబర్లు రాసి ఉంటాయి. అవి చాలా ప్రత్యేకతను కలిగి ఉంటాయి. వాటికి అర్థం ఏంటనేది మనలో చాలామందికి తెలిసి ఉండకపొవచ్చు. కానీ వాటి అర్ధం ప్రతీఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు ఇంట్లో గ్యాస్ సిలిండర్‌ను సురక్షితంగా ఉపయోగించుకోవాలంటే వాటి గురించి తెలిసి ఉండాలి. లేకపోతే ఇబ్బందులకు గురయ్యే అవకాశముంటుంది.
ఈ గుర్తులకు అర్థం ఏంటి..?
మీరు గ్యాస్ సిలిండర్లను చూస్తే వాటిపై A-26, B-27, D-28 లాంటి కోడ్‌లు ఉంటాయి. వీటికి అర్థం ఏంటనేది తెలియక చాలామంది పట్టించుకోరు. కానీ మీరు ఇంట్లో సిలిండర్‌ను సురక్షితంగా వాడుకోవాలంటే వాటి గురించి తెలిసి ఉండాలి. సిలిండర్ భద్రతను నిర్ధారించడంలో ఆ గుర్తులు ఉపయోగపడతాయి. ఈ కోడ్‌లను చూసి సిలిండర్ ఎక్స్‌పైరీ డేట్ అని అనుకుంటారు. కానీ అసలు అర్థం అది కాదు. మీ సిలిండర్‌కు సేఫ్టీ టెస్ట్ మళ్లీ ఎప్పుడు చేయాలనే విషయాన్ని ఈ కోడ్‌లు తెలియచేస్తాయి. సిలిండర్ పైభాగంలో ఉండే మెటల్ రింగ్ మీద అక్షరాలు, నెంబర్లతో కూడిన ఈ కోడ్‌లు ఉంటాయి. A అనేది జనవరి నుంచి మార్చిని సూచిస్తోంది. B ఏప్రిల్ నుంచి జూన్‌ను, C జూలై నుంచి సెప్టెంబర్, D-అక్టోబర్ నుంచి డిసెంబర్‌ను సూచిస్తోంది.
సిలిండర్ తీసుకునేముందు చెక్ చేస్కోండి
ఇక 25,26 నెంబర్లు ఇయర్‌ను సూచిస్తాయి. ఉదాహరణకు మీ సిలిండర్‌పై B-26 అని రాసి ఉంటే.. 2026 ఏప్రిల్-జూన్ మధ్యలో సేఫ్టీ టెస్ట్ చేయాలని అర్థం. D-28 అని ఉంటే 2028 అక్టోబర్-డిసెంబర్ మధ్య సేఫ్టీ టెస్ట్ నిర్వహించాలని అర్థం. మీరు గ్యాస్ తీసుకునేటప్పుడు సిలిండర్లపై ఈ నెంబర్లను చెక్ చేస్కోండి. గడువు తేదీ దాటిన సిలిండర్ మీకు అందిస్తే గ్యాస్ ఏజెన్సీలను సంప్రదించి సిలిండర్ మార్చుకోండి. సిలిండర్లు పాతవి అయ్యే కొద్ది తుప్పు పట్టడం, లీకులు కావడం వంటివి చోటుచేసుకుంటాయి. దీంతో వాటికి ఎప్పటికప్పుడు హైడ్రోస్టాటిక్ టెస్టులు ఈ కోడ్‌లు నమోదు చేస్తారు. మళ్లీ సిలిండర్‌కు టెస్ట్ ఎప్పుడు చేయాలనే విషయాన్ని ఈ కోడ్‌లు సూచిస్తాయి. టెస్టుల్లో సిలిండర్‌లో ఎలాంటి సమస్య లేదని తేలితే కొత్త డేట్ ప్రింట్ చేస్తారు. అదే సమస్యలు ఉంటే సిలిండర్ పనికిరానిదిగా గుర్తించి మార్కెట్లోకి పంపించరు.