Reading Time: < 1 minute

అడవిలోని అన్నలంతా మా పార్టీలోనే ఉన్నారు.. జాగ్రత్త!  సింగరేణి యాజమాన్యానికి కవిత వార్నింగ్

Caption of Image.

సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వంపై  టీఆర్ఎస్ చీప్ కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అడవిలో అన్నలు లేరనే ధీమాతో సింగరేణి యాజమాన్యం కార్మికులను తీవ్రంగా వేధిస్తోందని మండిపడ్డారు. ఈ క్రమంలోనే కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. అడవిలో అన్నలు లేరని సింగరేణి యాజమాన్యం కార్మికులను వేధిస్తోంది. గుర్తుపెట్టుకోండి… అడవిలోని అన్నలందరూ ఇప్పుడు మా పార్టీలోనే ఉన్నారు… జాగ్రత్త! కార్మికులను ఇబ్బందులు పెడితే టీఆర్‌ఎస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. 

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి ఏరియాలో టీఆర్‌ఎస్ నాయకురాలు కవిత చేపట్టిన ‘బాయి బాట’ కార్యక్రమం రెండో రోజు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-7 భూగర్భ గనిలోకి వెళ్లేందుకు కవిత యత్నించగా… సింగరేణి యాజమాన్యం, పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. గనిలోకి అనుమతించేది లేదని స్పష్టం చేయడంతో… టీఆర్‌ఎస్ శ్రేణులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వివాదం నడిచింది. ఆగ్రహం వ్యక్తం చేసిన కార్యకర్తలు గేట్లను నెట్టుకుంటూ లోపలికి దూసుకెళ్లారు. కవిత గని ప్రాంగణంలోకి అడుగుపెట్టినప్పటికీ… పోలీసులు ఆమెను అడుగడుగునా అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా  .. టీఆర్‌ఎస్ చేపట్టిన సింగరేణి బాయి బాట ఉద్యమంతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలకు వణుకు మొదలైందన్నారు. కార్మికుల హక్కుల కోసం తమ పోరాటం ఆగేది లేదన్నారు. మెడికల్ బోర్డును ప్రతి నెలా రెండు సార్లు నిర్వహించాలని డిమాండ్ చేశారు. లాభాల వాటా పేరుతో ప్రతి సంవత్సరం కార్మిక వర్గానికి యాజమాన్యం తీవ్ర అన్యాయం చేస్తోందని ధ్వజమెత్తారు. కార్మికుల పని స్థలాల్లో నాణ్యమైన రక్షణ పరికరాలను వెంటనే ఏర్పాటు చేయాలని, లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కవిత హెచ్చరించారు.

©️ VIL Media Pvt Ltd.