
కర్నూలు, జూన్ 17: అమెరికాలో జూన్ 15న జరిగిన విమాన ప్రమాదంలో కర్నూలు జిల్లా కోసిగి మండలం తుంబిగనూరు గ్రామానికి చెందిన దాట్ల సుబ్రహ్మణ్యం రాజు కుమారుడు సాయి కార్తీక్ వర్మ( 26) దుర్మరణం చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు..
దాట్ల సుబ్రహ్మణ్యం రాజు, పద్మావతి దంపతుల సొంత గ్రామం కోస్తాంధ్రలోని భీమవరం. కాగా 30ఏళ్ల క్రితం కోసిగి మండలంలోని తుంబిగనూరు వచ్చి స్థిరపడ్డారు. వీరికి ఏకైక కుమారుడు సాయి కార్తీక్ వర్మ సంతానం. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్ళాడు. యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిస్సోరి లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అక్కడే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ కాన్సాస్ రాష్ట్రంలో ఉంటున్నారు. ఈ నెల 15న ఆదివారం సరదాగా గడిపేందుకు స్కై డైవింగ్ సాహసక్రీడలో పాల్గొనేందుకు వెళ్లాడు.
వీరిని తీసుకెళ్తున్న చిన్న విమానం సాంకేతిక లోకంతో కుప్పకూలడంతో మంటలు చెలరేగి 12 మంది అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది. అందులో తమ ముద్దుల కొడుకు సాయి కార్తీక్ వర్మ కూడా ఉన్నట్లు చెప్పడంతో ఒక్కసారిగా తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. అమెరికాలో ఉద్యోగం చేస్తూ చేదోడుగా ఉన్న ఒక్కగానొక్క కుమారుడు అకాల మరణం చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. స్థానికంగా ఉన్న కొందరు నేతలు బాధిత కుటుంబ సభ్యులను కలిసి ఓదారుస్తున్నారు.