Reading Time: 2 minutes
Bcci Secretary Devajit Saikia Reacts To Vaibhav Sooryavanshi Dambulla Controversy

Devajit Saikia: దంబుల్లా వేదికగా జరిగిన భారత్-ఎ, శ్రీలంక-ఎ మ్యాచ్ క్రికెట్ అభిమానులను ఊపేసింది. ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్ చివరకు సూపర్ ఓవర్‌కు దారితీసింది. అయితే, ఈ సూపర్ ఓవర్‌లో శ్రీలంక నిర్దేశించిన 17 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో టీమిండియా విఫలమైంది. భారత్-ఎ జట్టు కేవలం 9 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివరి మూడు బంతులను ఎదుర్కొన్న యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మ్యాచ్‌ను గెలిపించలేకపోయాడు. దీంతో ఈ త్రైపాక్షిక సిరీస్‌లో భారత్‌ వరుసగా రెండో ఓటమిగా కూడగట్టుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ శ్రీలంక ఆటగాడైన విశేన్ హలంబెజ్‌ను నెట్టి వేయడంపై దుమారం రేగుతోంది.

ఆటపైనే మా దృష్టి..

ఇక,ఈ ఘటనతో సూర్యవంశీపై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంటుందేమోనని, అతడిని మందలించే అవకాశం ఉందంటూ క్రీడా వర్గాల్లో పెద్ద ఎత్తున ఊహాగానాలు రేగాయి. కానీ, ఈ వివాదంపై తాజాగా బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు. వైభవ్‌పై చర్యలు తీసుకుంటారన్న ఊహాగానాలను పూర్తిగా కొట్టిపారేశారు. తమ ఆటగాళ్లు ప్రస్తుతానికి కేవలం టోర్నమెంట్‌పై మాత్రమే దృష్టి పెట్టాలని తాము కోరుకుంటున్నామని, ఇలాంటి బాహ్య పరమైన వివాదాల వల్ల వారి దృష్టి మళ్లకూడదనే ఉద్దేశంతో ఉన్నామని స్పష్టం చేశారు. దీంతో ఈ యువ ఆటగాడిపై ప్రస్తుతానికైతే బీసీసీఐ చర్యలేమీ ఉండకపోవచ్చని స్పష్టమైంది.

మరోవైపు.. క్రికెట్ మైదానంలో ఆటగాళ్ల మధ్య భౌతిక దాడులు లేదా నెట్టివేతలను ఐసీసీ (ICC) తీవ్రంగా పరిగణిస్తుంది. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ లోని ఆర్టికల్ 2.12 ప్రకారం.. అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్, అంపైర్లు, మ్యాచ్ రెఫరీ లేదా ప్రేక్షకులతో సహా ఎవరితోనైనా అనుచితంగా భౌతిక సంబంధాన్ని (ఫిజికల్ కాంటాక్ట్) కలిగి ఉండటం నిషిద్ధం. ఆటగాళ్లు కావాలని లేదా అజాగ్రత్తగా ఇతర ఆటగాళ్లను, అంపైర్లను ఢీకొట్టడం, భుజాలతో నెట్టడం వంటివి ఈ నిబంధనల ఉల్లంఘన కిందికే వస్తాయి. ఈ తరహా ఘటనలు జరిగినప్పుడు సదరు ప్రవర్తన ఎంత తీవ్రమైనదో అంచనా వేయడానికి ఐసీసీ కొన్ని అంశాలను పరిశీలిస్తుంది. ఆ తోపులాట ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేదా అజాగ్రత్త వల్ల జరిగిందా? అనే విషయాలను పరిశీలించనుంది.

అసలు ఏం జరిగింది?

భారత్-ఎ, శ్రీలంక-ఎ మ్యాచ్ ముగిసిన తరువాత అసలు డ్రామా మొదలైంది. లంక ఆటగాళ్లు తమ విజయాన్ని తీవ్రమైన ఉత్సాహంతో, పెద్ద పెట్టున అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ ఓటమి భారంతో తన బ్యాటింగ్ పార్ట్‌నర్ సూర్యాంశ్ షెడ్గేతో కలిసి పెవిలియన్ వైపు అడుగులు వేస్తున్న వైభవ్ సూర్యవంశీకి లంక ఆటగాళ్ల అతి ప్రవర్తన అస్సలు నచ్చలేదు. ఆగ్రహంతో వెనక్కి తిరిగిన సూర్యవంశీ, లంక ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగాడు. కోపంలో ఒక శ్రీలంక ప్లేయర్‌ను భౌతికంగా వెనక్కి నెట్టేశాడు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో మిగిలిన శ్రీలంక క్రికెటర్లు వెంటనే జోక్యం చేసుకోవడంతో గొడవ సర్దుమనిగింది. ఐపీఎల్ ఫామ్‌ను ఇక్కడ కూడా కొనసాగిస్తాడని ఆశించిన సూర్యవంశీ.. ఈ సిరీస్‌లో పెద్ద స్కోర్‌లు సాధించ లేకపోయాడు. ఆ నిరాశకు తోడు లంక ఆటగాళ్ల స్లెడ్జింగ్ తోడవడంతో మైదానంలో ఈ హైడ్రామా చోటుచేసుకుంది.