Reading Time: < 1 minute

రేవంత్ పాలనలో స్కీమ్‌లు లేవు.. అంతా స్కామ్‌లే: హరీశ్ రావు

Caption of Image.

కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో విధ్వంసం జరుగుతోందన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు.  మానుకొండూరు బీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశంలో కాంగ్రెస్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు  హరీశ్ రావు. రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో స్కీమ్‌లు లేవని… అంతా స్కామ్‌ల రాజ్యమే నడుస్తోందని మండిపడ్డారు.

అధికారులపై సీఎం రేవంత్‌కే నియంత్రణ లేదని… తన మాట అధికారులు వినడం లేదని స్వయంగా ముఖ్యమంత్రే చెప్పుకోవడం ఈ ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమన్నారు.బీఆర్ఎస్ శ్రేణులపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని… ఇలాంటి బెదిరింపులకు, కేసులకు భయపడే ప్రసక్తే లేదని హరీశ్ రావు స్పష్టం చేశారు. 

కరీంనగర్ జిల్లా మంత్రులు తనకు సవాళ్లు విసురుతున్నారని… అసలు వారి శాఖల్లో ఏం జరుగుతుందో కూడా ఆ  మంత్రులకు తెలియని పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. ఇదొక ఎగవేతల ప్రభుత్వం అని దుయ్యబట్టారు హరీశ్ రావు. రైతులకు ఇచ్చే రూ.19 వేల కోట్ల రైతుబంధు నిధులను ఈ ప్రభుత్వం నిలువునా ఎగ్గొట్టిందని ఆరోపించారు. 

వడ్లు కొనే దిక్కు లేదు… రైతుబంధు ఎప్పుడు పడిందో, ఎంత పడిందో ఎవరికీ తెలియని గందరగోళం నెలకొంది. రైతు విషయంలో కాంగ్రెస్ అంతా మోసం చేస్తోందని… వెంటనే రైతులకు బాకీ పడ్డ ప్రతి పైసా చెల్లించాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. రాష్ట్రానికి మళ్లీ పాత కాలం నాటి కష్టాలు వచ్చాయంటూ హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

 

©️ VIL Media Pvt Ltd.