
హిందూ సాంప్రదాయంలో తులసి మొక్కకు అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. మన దేశంలో దాదాపు ప్రతి ఇంట్లో తులసి కోట కనిపించడం సర్వసాధారణం. తులసి కేవలం ఆధ్యాత్మిక పరంగానే కాకుండా.. ఎన్నో రకాల ఆయుర్వేద, ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న అద్భుతమైన మొక్క. అయితే, చాలా మంది తమ ఇంట్లోని తులసి మొక్కను ఎంతో భక్తిశ్రద్ధలతో చూసుకున్నప్పటికీ.. కొద్దిరోజులకే అది ఎండిపోవడం లేదా ఆకులు నల్లగా మారి రాలిపోవడం వంటివి జరుగుతుంటాయి. తులసి మొక్క అలా ఎండిపోవడానికి వాతావరణం మాత్రమే కారణం కాదు.. మనం నిత్యం పూజ చేసేటప్పుడు లేదా మొక్కను పెంచేటప్పుడు తెలియకుండా చేసే కొన్ని చిన్న చిన్న తప్పులే దీనికి ముఖ్య కారణం. ఆయుర్వేద, గార్డెనింగ్ నిపుణుల ప్రకారం, తులసి మొక్క ఎప్పుడూ పచ్చగా, గుబురుగా కళకళలాడాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో.. మనం చేసే ఏ తప్పుల వల్ల మొక్క ఎండిపోతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
తులసి మొక్క ఎండిపోవడానికి కారణమయ్యే 4 ప్రధాన తప్పులు..
రోజుకు బకెట్ల కొద్దీ నీళ్లు పోయడం
చాలా ఇళ్లలో ఉదయాన్నే స్నానం చేయగానే ఇంటి సభ్యులంతా వరుసగా వచ్చి తులసి మొక్కకు నీళ్లు పోస్తూ పూజిస్తారు. ఇలా భక్తితో అవసరానికి మించి ఎక్కువగా నీరు పోయడం వల్ల కుండీలోని మట్టి ఎప్పుడూ బురదలా మారుతుంది. దీనివల్ల తులసి వేర్లు కుళ్ళిపోయి, మొక్క చాలా వేగంగా ఎండిపోతుంది.
ఏం చేయాలి?: తులసి కుండీలోని మట్టిని చేత్తో తాకి చూడండి. పైమట్టి పూర్తిగా ఎండిపోయినట్టు అనిపిస్తేనే నీరు పోయాలి. అలాగే కుండీ అడుగున అదనపు నీరు బయటకు పోవడానికి ఖచ్చితంగా ఒక చిన్న రంధ్రం ఉండేలా చూసుకోవాలి.
గింజలని తీసివేయకపోవడం
తులసి మొక్క కొమ్మల చివర్లో ఆకుపచ్చ లేదా గోధుమ రంగులో మంజరి అంటే తులసి గింజల వెన్నులు వస్తుంటాయి. చాలా మంది వీటిని అలాగే వదిలేస్తారు. కానీ మంజరి ఎక్కువగా వస్తే మొక్క క్రమంగా ఎండిపోవడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మొక్క తన పూర్తి శక్తినంతా ఆ గింజలను తయారు చేయడానికే ఉపయోగించి, ఆకులకు పోషణను అందించడం తగ్గించేస్తుంది.
ఏం చేయాలి?: తులసి మొక్కపై మంజరి కనిపించగానే.. వాటిని చేతి వేళ్లతో లేదా కత్తెరతో జాగ్రత్తగా కత్తిరించి వేరు చేయాలి. ఇలా చేయడం వల్ల మొక్క మళ్లీ కొత్త చిగుళ్లతో గుబురుగా పెరుగుతుంది.
పురుగులు, కీటకాల దాడి
వర్షాకాలంలో లేదా వాతావరణంలో తేమ ఎక్కువైనప్పుడు తులసి ఆకుల వెనుక చిన్న చిన్న నల్లటి పురుగులు లేదా బూజు లాంటి ఫంగస్ చేరుతుంది. ఇది ఆకుల రసాన్ని పీల్చేసి మొక్కను నిర్జీవంగా మారుస్తుంది. దీనికోసం మార్కెట్ కెమికల్స్ వాడనక్కర్లేదు. ఇంట్లోనే కొన్ని వేపాకులను నీళ్లలో వేసి బాగా మరిగించండి. ఆ నీరు చల్లారిన తర్వాత ఒక స్ప్రే బాటిల్‌లో పోసి, వారానికి ఒకసారి తులసి ఆకులపై చల్లండి. క్రిములన్నీ మాయమైపోతాయి.
ఎండ తగలని ప్రదేశంలో ఉంచడం
తులసి మొక్క ఆరోగ్యంగా పెరగడానికి సూర్యరశ్మి చాలా అవసరం. చాలా మంది బాల్కనీల్లో లేదా నీడ ఎక్కువగా ఉండే ఇండోర్ ప్రదేశాలలో తులసిని ఉంచుతారు. దీనివల్ల మొక్కకు సరిపడా కాంతి లభించక ఆకులు రాలిపోతాయి. తులసి కుండీని రోజుకు కనీసం 4 నుండి 5 గంటల పాటు నేరుగా ఎండ తగిలే ప్రదేశంలోనే ఉంచాలి.