
పెట్రోల్, డీజిల్ దిగుమతులను తగ్గించడం, దేశంలో ఇంధన లభ్యతను పెంచేందుకు ప్రత్యామ్నాయంగా ఇథనాల్ కలిపిన పెట్రోల్ ఇ-20ను కేంద్రం అందుబాటులోకి తెస్తోంది. అన్ని పెట్రోల్ బంకుల్లో ఇథనాల్ పెట్రోల్ లభ్యతను పెంచాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఇ-20 పెట్రోల్‌పై అనేక వదంతులు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఈ రకం పెట్రోల్ వాడితే వెహికల్ ఇన్య్సూరెన్స్ వర్తించదనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో దీనిపై బీమా సంస్థలు స్పష్టతిచ్చాయి. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలిపాయి. ఈ మేరకు వాహనాల్లో నెలకొన్న ఆందోళనలను తెరదించాయి. ఇ-20 ఇథనాల్ పెట్రోల్ వాడటం వల్ల వాహనాలు దెబ్బతింటాయని, ఇంజిన్ భాగాలు దెబ్బతినే అవకాశం ఉన్నందున వెహికల్ ఇన్యూరెన్సులు చెల్లవని ప్రచారం నడుస్తోంది. 2023 ఏప్రిల్ కంటే ముందు తయారైన పాత వాహనాలు ఈ రకం పెట్రోల్‌కు అనుకూలంగా లేవని, ఒకవేళ ఆ పెట్రోల్ నింపడం వల్ల వాహనం పాడైతే ఇన్యూరెన్స్ క్లెయిమ్ చేసుకోలేరనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
క్లెయిమ్స్ వర్తిస్తాయి..
వాహనదారుల నిర్లక్ష్యం వల్ల వాహనం పాడైపోయిందని భావించి కంపెనీలు ఇన్యూరెన్స్ ఇవ్వవని అంటున్నారు. దీని ద్వారా క్లెయిమ్స్ రాకపోవడంతో పాటు ఇన్యూరెన్స్ పాలసీలు రద్దు అవుతాయనే ప్రచారం నడుస్తోంది. పెట్రోల్ బంకుల్లో కూడా ఇథనాల్ రకం పెట్రోల్ ఎక్కువగా లభిస్తుండటంతో ఆ ప్రచారం నిజమేనని అందరూ నమ్ముతున్నారు. ఈ ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బీమా సంస్థలు స్పందించాయి. ఇ-20 పెట్రోల్ వినియోగించినా మోటార్ ఇన్యూరెన్స్ పాలసీలకు ఎలాంటి భంగం వాటిల్లదని, పాత వాహనాల్లో ఈ ఇంధనాన్ని వాడటాన్ని వాహనదారుల నిర్లక్ష్యంగా భావించడం లేదని బీమా సంస్థలు స్పష్టం చేశాయి. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రగతిశీల అడుగుగా ఇ20 ఇంధనాన్ని భావిస్తున్నట్లు తెలిపారు. వాహనాల్లో ఇంధనానికి, క్లెయిమ్‌కు ఎలాంటి సంబంధం లేదని, నిబంధనల ప్రకారం బీమా ఏ ఇంధనం వాడినా వర్తిస్తుందని పేర్కొన్నాయి. ఇంధనం సాకుగా చూపించి క్లెయిమ్ రిజెక్ట్ చేసేది ఉండదని స్పష్టం చేశాయి.