Reading Time: < 1 minute
G7 Summit Viral Photo Trump Standing Alone World Leaders Huddle France

ఫ్రాన్స్ వేదికగా ప్రస్తుతం జీ 7 సదస్సు జరుగుతోంది. ఈ సమావేశానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సహా ప్రపంచ నేతలంతా హాజరయ్యారు. అయితే సమ్మిట్‌లో ట్రంప్ ఒంటరిగా నిలబడిన ఫొటో వైరల్ అవుతోంది. సదస్సు ప్రారంభానికి ముందు ప్రపంచ నేతలు ఒకచోట చేరి చర్చల్లో పాల్గొనగా.. ట్రంప్ మాత్రం కొంత దూరంలో ఒంటరిగా నిలబడి కనిపించడం చర్చనీయాంశమైంది. ఇందుకు సంబంధించిన ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

వైరల్ అయిన ఫొటోలో జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడ్రిచ్ మెర్జ్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పరస్పరం చర్చలు జరుపుతున్నట్లు కనిపించారు. అదే సమయంలో ట్రంప్ మాత్రం కొద్దిదూరంలో ఒంటరిగా నిలబడి ఉండటం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది.

ఇటీవల ప్రకటించిన అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం ఈ సదస్సులో ప్రధాన చర్చాంశంగా మారింది. ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో ద్వైపాక్షిక సమావేశం సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్‌తో తదుపరి దశ చర్చలు తొలి చర్చల కంటే సులభంగా ఉంటాయని చెప్పారు. అలాగే అమెరికా ఇరాన్‌కు ఆర్థిక సహాయం అందించబోదని స్పష్టం చేశారు.

ఇజ్రాయెల్‌పై ట్రంప్ అసంతృప్తి

లెబనాన్ అంశంపై కూడా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. హిజ్బుల్లాపై పోరాటంలో ఇజ్రాయెల్ చర్యలు చాలా కాలంగా కొనసాగుతున్నాయని.. అధిక ప్రాణనష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అవసరమైతే సిరియా మరింత సమర్థంగా వ్యవహరించగలదని కూడా వ్యాఖ్యానించారు.

జెలెన్‌స్కీతో భేటీ


ఇక సదస్సు సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ట్రంప్ సమావేశం అయ్యారు. ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేలా రష్యా ఒప్పందానికి రావాలని పిలుపునిచ్చారు.