
Uddhav Thackeray: మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి హీట్ ఎక్కాయి. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) మరోసారి చీలిక వైపు అడుగులు వేస్తోందా? అంటే అవుననే అంటున్నాయి అక్కడి రాజకీయ పరిణామాలు. 2022లో ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటుతో అధికారాన్ని, పార్టీ గుర్తును కోల్పోయిన ఉద్ధవ్ ఠాక్రేకు.. ఇప్పుడు లోక్‌సభ ఎంపీల రూపంలో సరికొత్త గండం పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) లోపల చెలరేగిన అంతర్గత సంక్షోభం తర్వాత, మహారాష్ట్రలో ఉద్ధవ్ సేనపై కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉందనే ఊహాగానాలు జోరందుకున్నాయి.
మాతోశ్రీ మీటింగ్‌కు ఐదుగురు దూరం..
ఈ నేపథ్యంలో పార్టీని కాపాడుకునేందుకు ఉద్ధవ్ ఠాక్రే ఆదివారం తన నివాసమైన ‘మాతోశ్రీ’లో అత్యవసరంగా లోక్‌సభ ఎంపీల సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ భేటీకి మొత్తం 9 మంది ఎంపీలకు గాను కేవలం నలుగురు మాత్రమే స్వయంగా హాజరవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అరవింద్ సావంత్, అనిల్ దేశాయ్, రాజాభౌ వాజే, సంజయ్ దీనా పాటిల్ మాత్రమే నేరుగా హాజరై ఉద్ధవ్‌కు అండగా నిలిచారు. మిగిలిన ఐదుగురు ఎంపీలు.. భావుసాహెబ్ వాక్చౌరే, ఓంప్రకాష్ రాజే నింబలక్, నాగేష్ బాపురావు పాటిల్ అష్టికర్, సంజయ్ దేశ్‌ముఖ్, సంజయ్ జాదవ్ ఈ సమావేశానికి రాలేదు. వారు ఆన్‌లైన్ ద్వారా ఈ సమావేశానికి కనెక్ట్ అయ్యారని, గైర్హాజరీకి వ్యక్తిగత, కుటుంబ కారణాలు ఉన్నాయని సంజయ్ రౌత్ కవర్‌చేసే ప్రయత్నం చేసినప్పటికీ, తెర వెనుక అసలు కథ వేరే ఉందనే నివేదికలు వస్తున్నాయి.
రంగంలోకి ‘ఆపరేషన్ టైగర్’..
మరోవైపు ఉద్ధవ్ ఠాక్రే మాతోశ్రీలో సమావేశం నిర్వహిస్తుండగానే.. యూబీటీ ఎంపీ సంజయ్ దేశ్‌ముఖ్ ఢిల్లీలో షిండే వర్గానికి చెందిన కేంద్ర మంత్రి ప్రతాప్ రావు జాదవ్‌తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. శివసేన ఎమ్మెల్సీ కృపాల్ తుమ్నే చేసిన వ్యాఖ్యలు ఈ సస్పెన్స్‌ను మరింత పెంచాయి. ఏక్‌నాథ్ షిండే ఆధ్వర్యంలో ‘ఆపరేషన్ టైగర్’ తుది దశకు చేరిందని, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందే ఉద్ధవ్ వర్గానికి చెందిన ఏడుగురు లోక్‌సభ ఎంపీలు, మరో 16 మంది ఎమ్మెల్యేలు షిండే శిబిరంలో చేరడం ఖాయమని తాజాగా ఆయన బాంబు పేల్చారు. యాంటీ డిఫెక్షన్ (ఫిరాయింపుల నిరోధక) చట్టం ప్రకారం అనర్హత వేటు పడకుండా ఉండాలంటే.. ఉద్ధవ్ వర్గంలోని 9 మంది ఎంపీలలో కనీసం మూడింట రెండు వంతుల మంది (అంటే ఆరుగురు ఎంపీలు) ఒకేసారి విడిపోయి షిండే గ్రూపులో చేరాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆ మ్యాజిక్ ఫిగర్ కోసమే తెరవెనుక చర్చలు జరుగుతున్నట్లు టాక్ నడుస్తుంది.
‘ఆపరేషన్ వోల్ఫ్’తో సంజయ్ రౌత్ కౌంటర్
ఈ లీకులపై ఉద్ధవ్ సేన ఫైర్‌బ్రాండ్ నాయకుడు సంజయ్ రౌత్ తీవ్రంగా స్పందించారు. తమ ఎంపీలందరూ ఉద్ధవ్ వెంటే ఉన్నారని, ఈ పుకార్లకు త్వరలోనే బ్రేక్ పడుతుందని చెప్పారు. అంతేకాదు తాము ఊరికే కూర్చోబోమని.. షిండే సేనలోని ఎమ్మెల్యేలు, ఎంపీలను టార్గెట్ చేస్తూ త్వరలోనే మహారాష్ట్రలో ‘ఆపరేషన్ వోల్ఫ్’ (Operation Wolf) స్టార్ట్ చేయబోతున్నట్లు ప్రతిసవాల్ విసిరారు. ప్రస్తుతానికి ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రేలు రంగంలోకి దిగి నష్టనివారణ చర్యలు ప్రారంభించినప్పటికీ, మహారాష్ట్ర రాజకీయాల్లో తదుపరి కుదుపు ఎప్పుడు వస్తుందా అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.