
Vaibhav Suryavanshi : క్రికెట్ ప్రపంచంలో ప్రతిభ ఒక్కరోజులో పుట్టదు. ప్రేక్షకులు చూసేది కేవలం మ్యాచ్‌లో కొట్టిన సిక్సర్లు, సాధించిన రికార్డులు మాత్రమే. అయితే ఆ విజయాల వెనుక వేల గంటల చెమట, లక్షల సార్లు చేసిన సాధన, కుటుంబం చేసిన త్యాగాలు కూడా ఉంటాయి. ప్రస్తుతం భారత క్రికెట్‌లో సంచలనంగా మారిన వైభవ్ సూర్యవంశీ కథ కూడా అలాంటిదే. ఐపీఎల్‌లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచిన ఈ యువ ఆటగాడు, ఇప్పుడు కేవలం 15 ఏళ్ల వయసులోనే భారత జట్టుకు ఎంపికై మరో చరిత్ర సృష్టించాడు. అయితే అతని ప్రతిభ ఒక్క రోజులో వచ్చింది కాదని, ఆరేళ్ల పాటు సాగిన కఠోర శ్రమ అని అతని చిన్ననాటి కోచ్ మనీష్ ఓఝా తాజాగా వెల్లడించారు.
గత రెండు ఐపీఎల్ సీజన్లలో వైభవ్ సూర్యవంశీ ఆడిన దూకుడు ఇన్నింగ్స్‌లు అతడిని దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మార్చాయి. తాజాగా జరిగిన ఐపీఎల్ సీజన్‌లో 237కు పైగా స్ట్రైక్ రేట్‌తో 776 పరుగులు చేసి టోర్నమెంట్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన అతడు, యునైటెడ్ కింగ్‌డమ్ టీ20 పర్యటనకు భారత జట్టులో స్థానం సంపాదించాడు. అయితే ఈ స్థాయికి చేరుకోవడానికి అతను ఎంత కష్టపడ్డాడో అతని కోచ్ చెప్పిన వివరాలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
పాట్నాలోని తన అకాడమీలో ఎనిమిదేళ్ల వయసు నుంచే వైభవ్‌కు శిక్షణ ఇచ్చాడు మనీష్ ఓఝా. చిన్నప్పటి నుంచే అతడు అసాధారణమైన క్రమశిక్షణను అలవర్చుకున్నాడు. ముఖ్యంగా పదేళ్ల వయసు దాటిన తర్వాత ప్రతి రోజు సుమారు ఎనిమిది గంటల పాటు సాధన చేసేవాడట. ఒక రోజులో దాదాపు 100 ఓవర్లు ఎదుర్కొనేవాడని, కనీసం 600 బంతులకు పైగా బ్యాటింగ్ చేసేవాడని ఆయన తెలిపారు. ఉదయం 7.30 గంటలకు మొదలయ్యే సాధన సాయంత్రం 4 గంటల వరకు కొనసాగేదని చెప్పారు. ఇందులో నెట్ బౌలింగ్, త్రోడౌన్స్, బౌలింగ్ మెషీన్ ప్రాక్టీస్ అన్నీ భాగమయ్యేవి.
వైభవ్ విజయంలో అతని కుటుంబం పాత్ర కూడా అంతే కీలకమని ఓఝా చెప్పుకొచ్చారు. సమస్తిపూర్ నుంచి ప్రతి రోజు గంటల ప్రయాణం చేసి అకాడమీకి రావడం చిన్న విషయం కాదని చెప్పారు. ముఖ్యంగా అతని తల్లి ఆర్తి చేసిన త్యాగాలు మరింత భావోద్వేగానికి గురిచేస్తాయి. తెల్లవారుజామున రెండు గంటలకే లేచి వైభవ్, అతని తండ్రి మాత్రమే కాదు, వారితో పాటు వచ్చే బౌలర్లు, ఇతర పిల్లల కోసం కూడా ఆహారం సిద్ధం చేసేదని గుర్తుచేశారు. అకాడమీలో మధ్యాహ్న భోజనం లేక ఇబ్బంది పడే పిల్లలకు కూడా ఆమె తీసుకువచ్చిన భోజనం పంచిపెట్టేదని చెప్పారు. వైభవ్ బ్యాటింగ్‌లో కనిపించే ధైర్యం, విభిన్నమైన షాట్లు, అద్భుతమైన టైమింగ్ వెనుక ఉన్న అసలు రహస్యం ఇదేనని ఓఝా వివరించారు. అందుకే మ్యాచ్ పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉన్నా అతను భయపడకుండా సహజంగా ఆడగలుగుతున్నాడని విశ్లేషించారు.
ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ ప్రయాణం దేశవ్యాప్తంగా వేలాది మంది చిన్నారులకు స్ఫూర్తిగా మారింది. అతని విజయాన్ని చూసి ఐదేళ్ల చిన్న పిల్లలతో కూడా తల్లిదండ్రులు అకాడమీలకు వస్తున్నారని ఓఝా చెప్పారు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన బాలుడు కఠోర శ్రమ, ఫ్యామిలీ సపోర్ట్, సరైన శిక్షణతో అంతర్జాతీయ స్థాయికి ఎలా చేరుకోగలడో వైభవ్ కథ మరోసారి నిరూపిస్తోంది. ఇది కేవలం ఒక క్రికెటర్ విజయగాథ మాత్రమే కాదు, కలలను నిజం చేసుకోవాలంటే ఎంతటి అంకితభావం అవసరమో చెప్పే స్ఫూర్తిదాయకమైన ప్రయాణం.