
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చారిత్రక యాక్షన్ ఎపిక్ ‘రణబాలి’. దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 11, 2026న రిలీజ్ కు సిద్ధం అవుతోంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ మూవీపై అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. లేటెస్ట్ గా మూవీ నుంచి వచ్చిన అప్డేట్ ఒకటి ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పిస్తోంది.
హాలీవుడ్ విలన్ ఎంట్రీ..
మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో హాలీవుడ్ స్టార్, ‘ది మమ్మీ’ ఫేమ్ ఆర్నాల్డ్ వోస్లూ కీలక పాత్రలో కనిపించనున్నారు. అతడి పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన క్యారెక్టర్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆర్నాల్డ్ వోస్లూ ఈ మూవీలోకి ఎంట్రీ ఇవ్వడం టాలీవుడ్‌లో సంచలనంగా మారింది.
కరువు రాక్షసుడుతో ఢీ..
ఆర్నాల్డ్ వోస్లూ ఇందులో ‘సర్ థియోడర్ హెక్టర్’ అనే భయంకరమైన పాత్రలో కనిపిస్తున్నారు. మెటల్ కేప్ ధరించి, పొగమంచు మధ్యలో అత్యంత క్రూరంగా కనిపిస్తున్న ఆయనను చూస్తుంటే, వెన్నెముకలో వణుకు పుట్టక మానదు. ఈ పాత్రను ‘ద డెమోన్ ఆఫ్ డ్రాట్’ అని పిలవడం, ఈ సినిమా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వలస పాలన కాలంలో భారతీయ రైతాంగం ఎదుర్కొన్న కష్టాలను, ఆ కరువుకు కారణమైన ఒక క్రూరమైన బ్రిటీష్ అధికారిగా ఆర్నాల్డ్ పాత్ర కథకు కీలకం కానుంది.
రికార్డుల వేటలో ‘ఓ మేరే సాజన్’
కేవలం యాక్షన్ మాత్రమే కాదు, ఈ సినిమాలోని సంగీతం కూడా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఇప్పటికే విడుదలైన రొమాంటిక్ ‘ఓ మేరే సాజన్’ సాంగ్ యూట్యూబ్‌లో 3 మిలియన్ల వ్యూస్ దాటి దూసుకెళ్తోంది. కేవలం పాట మాత్రమే కాదు, సోషల్ మీడియాలో దీనిపై ఇప్పటికే 100,000కు పైగా రీల్స్ క్రియేట్ అవ్వడం విశేషం. అటు ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తిచేసుకుంది.
గ్లోబల్ అప్పీల్ కోసం భారీ ప్లాన్
విజయ్ ఒక వీరోచిత యోధుడిగా, రష్మిక ‘జయమ్మ’గా నటిస్తుంటే, ఆర్నాల్డ్ వంటి అంతర్జాతీయ నటుడు విలన్‌గా తోడవడంతో ‘రణబాలి’ స్థాయి అంతర్జాతీయ చిత్రాలకు ఏమాత్రం తీసిపోని విధంగా కనిపిస్తోంది. భారీ బడ్జెట్, అత్యాధునిక గ్రాఫిక్స్, ఎమోషనల్ కథనంతో రూపొందుతున్న ఈ చిత్రం, ఇండియన్ సినిమా సత్తాను ప్రపంచానికి చాటిచెప్పేలా ఉండబోతోంది. సెప్టెంబర్ 11న బాక్సాఫీస్ వద్ద ఈ రణబాలి యుద్ధం ఏ స్థాయిలో ఉండబోతోందో చూడాలని ఫ్యాన్స్ ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు..