Reading Time: 2 minutes
Fatima Sana Admits Pakistan Batting Collapse Cost Them Against India In Womens T20 World Cup 2026

Pakistan Captain Fatima Sana After India Defeat: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్థాన్ మహిళల జట్టు దారుణ ఓటమిని మూటగట్టుకుంది. ఆదివారం బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‌లో భారత్‌పై 64 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. 171 పరుగుల లక్ష్య ఛేదనలో పాక్ 17 ఓవర్లలో 106 పరుగులకే ఆలౌటైంది. భారీ ఓటమి తర్వాత పాకిస్థాన్ మహిళల జట్టు కెప్టెన్ ఫాతిమా సనా తీవ్ర నిరాశ వ్యక్తం చేసింది. తమ ఓటమికి బ్యాటింగే ప్రధాన కారణం అని అంగీకరించింది. బ్యాటింగ్ ఆరంభం చూస్తే.. తామే మ్యాచ్ గెలవాల్సిందని, భారత స్పిన్నర్లు దాటి చేయడంతో వరుసగా వికెట్స్ కోల్పోయి మూల్యం చెల్లించుకున్నాం అని తెలిపింది. ఇంకా టోర్నీ చాలా మిగిలి ఉందని, తదుపరి మ్యాచ్‌ల్లో మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉందని ఫాతిమా సనా చెప్పుకొచ్చింది.

ఓటమి చాలా నిరాశ కలిగించింది:

మ్యాచ్ అనంతరం ఫాతిమా సనా మాట్లాడుతూ.. ‘ఈ ఓటమి చాలా నిరాశ కలిగించింది. ముఖ్యంగా బ్యాటింగ్‌లో మేము ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాం. ప్రపంచకప్‌లో ఇంకా చాలా మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. కాబట్టి తదుపరి మ్యాచ్‌ల్లో తప్పకుండా మెరుగైన ప్రదర్శన చేయాలి. భారత్ ఇన్నింగ్స్ సందర్భంగా మొదటి 15 ఓవర్ల వరకు మేము బాగా బౌలింగ్ చేశాం. కానీ ఆ తర్వాత కొన్ని అదనపు పరుగులు ఇచ్చాం. ఒక సందర్భంలో ఫీల్డర్ తప్పుగా లోపలికి రావడం కూడా మాకు నష్టం చేసింది. అలాంటి చిన్న తప్పిదాలను సరిదిద్దుకోవాలి’ అని తెలిపింది.

ఫీల్డింగ్‌లో తప్పిదాలు చేశాం:

మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టుకు స్లో ఓవర్ రేట్ పెనాల్టీ విధించడంపై కూడా ఫాతిమా స్పందించింది. ‘భారత్ బ్యాటర్ల లెఫ్ట్-రైట్ కలయిక కారణంగా ఫీల్డ్ సెట్టింగ్స్ మార్చాల్సి వచ్చింది. మా జట్టు యువ ఆటగాళ్లతో నిండి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అనుభవం పెరిగే కొద్దీ వారు మరింత మెరుగ్గా వ్యవహరిస్తారు. ఫీల్డింగ్‌లో చేసిన పొరపాట్లు మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేశాయి. క్యాచ్‌లు మ్యాచ్‌లను గెలిపిస్తాయి. కానీ మేము కొన్ని కీలక క్యాచ్‌లు వదిలేశాం. ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్లే ఆ అవకాశాలను చేజార్చడం బాధాకరం. బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లో కూడా మెరుగుపడాలి. ఎందుకంటే ఫీల్డింగ్‌లో చేసే చిన్న తప్పిదం మొత్తం మ్యాచ్‌ను ప్రభావితం చేస్తుంది’ అని ఫాతిమా సనా పేర్కొంది.

పవర్‌ప్లేలో మేమే బాగా ఆడాం:

పవర్‌ప్లేలో తమ జట్టు మెరుగ్గా ఆడిందని పాక్ కెప్టెన్ ఫాతిమా చెప్పింది. అయితే ఆ తర్వాత బ్యాటింగ్ పూర్తిగా కుప్పకూలిందని అంగీకరించింది. ‘బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ పవర్‌ప్లేలో మేమే బాగా ఆడాం. కానీ ఆ తర్వాత బ్యాటింగ్‌లో వరుసగా వికెట్లు కోల్పోయాం. అదే మ్యాచ్‌ను మా చేతుల్లో నుంచి జార్చేసింది. భారత బౌలర్లు ఒత్తిడి పెంచారు. అందరూ బాగా బౌలింగ్ చేశారు. భవిష్యత్తులో మెరుగైన ఫలితాలు సాధించాలంటే బ్యాటింగ్‌లో స్థిరత్వం తీసుకురావాలి’ అని ఫాతిమా తెలిపింది. భారత్‌పై భారీ ఓటమితో పాకిస్థాన్ ప్రపంచకప్ ప్రచారాన్ని నిరాశాజనకంగా ప్రారంభించినప్పటికీ.. యువ జట్టు కావడంతో త్వరగా పుంజుకునే అవకాశాలు ఉన్నాయని ఫాతిమా సనా ఆశాభావం వ్యక్తం చేసింది. తదుపరి మ్యాచ్‌ల్లో తప్పిదాలను సరిదిద్దుకుని బలంగా తిరిగి రావడమే తమ లక్ష్యమని స్పష్టం చేసింది.