Reading Time: < 1 minute

మహా పాలిటిక్స్‎లో ఆపరేషన్ టైగర్ ప్రకంపనలు.. ఎమ్మెల్యేలకు ఉద్ధవ్ అత్యవసర పిలుపు

Caption of Image.

ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ఆపరేషన్ టైగర్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన యూబీటీకి చెందిన ఏడుగురు ఎంపీలు, 16 మంది ఎమ్మెల్యేలు డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గంలో చేరబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆపరేషన్ టైగర్ ప్రచార నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులను అడ్డుకునేందుకు ఉద్ధవ్ థాక్రే రంగంలోకి దిగారు. ఇందులో భాగంగానే పార్టీ శాసనసభాపక్ష అత్యవసర సమావేశానికి ఆయన పిలుపునిచ్చారు.

 2026, జూన్ 22న ముంబైలోని ఉద్ధవ్ నివాసం మాతోశ్రీలో ఈ అత్యవసర సమావేశం జరగనుంది. ఎమ్మెల్యేలు అందరూ ఈ సమావేశానికి హాజరు కావాలని ఆదేశించారు. ఎమ్మెల్యేల భేటీ కంటే ముందు పార్టీకి చెందిన ఎంపీలతో ఉద్ధవ్ థాక్రే సమావేశం నిర్వహించారు. శివసేన యూబీటీ వర్గానికి మొత్తం 9 ఎంపీలు ఉండగా.. ఈ సమావేశానికి కేవలం ఐదుగురు మాత్రమే హాజరయ్యారు.

మిగిలిన వారు వివిధ కారణాలతో వర్చువల్‎గా అటెండ్ అయినట్లు తెలిసింది. పార్టీ చీఫ్ నిర్వహించిన కీలక సమావేశానికి ఎంపీలు డుమ్మా కొట్టడం ఆపరేషన్ టైగర్ వార్తలకు మరింత బలం చేకూర్చింది. తాజా పరిణామాలను పరిశీలిస్తుంటే మహారాష్ట్రలో   2022 సీన్ రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది. అప్పట్లో శివసేన రెండుగా చీలిన విషయం తెలిసిందే. ఏక్ నాథ్ షిండే తిరుగుబావుటా ఎగరేశారు. 

►ALSO READ | బొకే వద్దన్న సీఎం విజయ్.. ఆ డబ్బుతో ముగ్గురు బాలికల భవిష్యత్తుకు విశాల్ భరోసా

షిండే వర్గం కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్‎కు మద్దతు ప్రకటించింది. ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వంలో షిండే శివసేన భాగస్వామిగా ఉంది. 2022 మాదిరిగా ఇప్పుడు ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన యూబీటీ నిలువునా చీలనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తు్న్నాయి. ఆపరేషన్ టైగర్ లో భాగంగా ఉద్ధవ్ శివసేన ఎంపీలు, ఎమ్మెల్యేలు షిండే వర్గంలోకి జంప్ కాబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులను అడ్డుకునేందుకు ఉద్ధవ్ థాక్రే చేస్తోన్న ప్రయత్నాలు ఏ మేర ఫలిస్తాయో చూడాలి మరీ.. 

©️ VIL Media Pvt Ltd.