Reading Time: 2 minutes
మగాళ్లు Vs మహిళలు.. రిలేషన్‌షిప్‌లో ఎవరు ఎక్కువ మోసం చేస్తారు..? ఇవి తెలిస్తే నోరెళ్లబెడతారు..

భార్యాభర్తల బంధంలో నమ్మకద్రోహం అనేది ఒక పెద్ద భూకంపం. ఒకప్పుడు పెళ్లయ్యాక మోసం చేయడం అంటే కేవలం పురుషులకు మాత్రమే పరిమితం అనే ఒక టాక్ ఉండేది. కానీ కాలం మారింది, సమాజంలో ఆలోచనలు మారాయి. ఈ క్రమంలో మగాళ్లు ఎక్కువగా మోసం చేస్తారా? లేక ఆడవాళ్లా? అనే ప్రశ్నకు సమాధానం వెతకడం అంత సులభం కాదు. న్యూయార్క్‌కు చెందిన ప్రముఖ ఫ్యామిలీ అండ్ డైవోర్స్ లాయర్ జేమ్స్ జోసెఫ్ సెక్స్టన్ తన సుదీర్ఘ అనుభవం ఆధారంగా దీనికి సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు. ఆయన ప్రకారం.. ఈ నమ్మకద్రోహం వెనుక కేవలం శారీరక ఆకర్షణ మాత్రమే ఉండదు, దంపతుల మధ్య పెరిగే భావోద్వేగ దూరం, ఒకరినొకరు నిర్లక్ష్యం చేయడం, ఇంట్లో ఆవరించే నిశబ్దమే దీనికి అసలైన బీజం వేస్తాయి. నమ్మకద్రోహానికి పాల్పడే వారిలో పురుషుల సంఖ్యే ఎక్కువగా ఉండొచ్చు. కానీ మహిళలు మోసం చేయాలని డిసైడ్ అయితే అది అత్యంత పకడ్బందీగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

మగాళ్లు ఎక్కువగా.. ఆడవాళ్లు తెలివిగా..

పురుషులు: చాలా మంది పురుషులు కేవలం శారీరక ఆకర్షణ, క్షణికానందం లేదా కేవలం అవకాశం దొరికింది కదా అనే రీతిలో మోసానికి ఒడిగడతారు. వీరికి భార్యపై ప్రేమ ఉన్నప్పటికీ ఇలాంటి తప్పులు చేస్తుంటారు.

మహిళలు: స్త్రీల విషయానికి వస్తే, వారు మోసం చేయడానికి ప్రధాన కారణం ఎమోషనల్ కనెక్ట్ లోపించడం. వైవాహిక బంధంలో భర్త నుండి సరైన గుర్తింపు, ప్రేమ, మానసిక మద్దతు లభించనప్పుడు వారు బయట ఆ ఆదరణ కోసం వెతుకుతుంటారు.

మోసానికి పునాది ఇదే..

చాలామంది అనుకున్నట్టు కేవలం శారీరక సుఖం కోసమే ఎఫైర్లు పుట్టుకురావు. బంధంలో పెరిగే భావోద్వేగ దూరం, మౌనం దీనికి ప్రధాన కారణాలు. వైవాహిక జీవితంలో తాము చెప్పేది వినే నాథుడు లేనప్పుడు, భర్త తనను అర్థం చేసుకోవడం లేదనిపించినప్పుడు మహిళలు ఆ ఒంటరితనం నుండి మహిళలు బయట ఆదరణ వెతుక్కుంటారు. ఆశ్చర్యకరంగా చాలా మంది పురుషులు కూడా భార్యతో ఎమోషనల్ కనెక్ట్ లోపించడం వల్లే బయటి వ్యక్తులకు దగ్గరవుతున్నారని న్యాయవాదులు చెబుతున్నారు. ఇక్కడ మరొక్క విషయం ఏంటంటే.. భర్త దొరికిపోతే.. భార్య అడిగే మొదటి ప్రశ్నం.. ఇంకా ఆమెను ప్రేమిస్తున్నావా అని.. అదే భార్య మోసం చేస్తే భర్త అడిగే మొదటి ప్రశ్న.. అతడితో శారీరక సంబంధం పెట్టుకున్నావా..? అని ఇక్కడ మగవారిలో తన హక్కు లేదా ఆధిపత్యం పోయిందనే ఆందోళన కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఆర్థిక స్వాతంత్య్రం  – సోషల్ మీడియా ప్రభావం

ఈ రోజుల్లో మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడం, సోషల్ మీడియా, డేటింగ్ యాప్స్ అందుబాటులోకి రావడం వల్ల బయటి సంబంధాలు పెట్టుకోవడం మునుపటి కంటే సులువైందని లాయర్లు గమనిస్తున్నారు. బంధం నచ్చకపోతే బయటకు వచ్చే ధైర్యం కూడా ఇప్పుడు పెరిగింది. విడాకుల లాయర్ల ప్రకారం.. పురుషులు దొరికిపోతే చాలా సులభంగా పశ్చాత్తాపపడతారు. తప్పు ఒప్పుకుని బంధాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఒక మహిళ ఎమోషనల్ కనెక్ట్ అయ్యి వేరే వ్యక్తి వైపు వెళ్తే, ఆమె తిరిగి భర్త దగ్గరకు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. వారు విడాకులకే మొగ్గు చూపుతారు. సర్వేల ప్రకారం 20 నుండి 30 ఏళ్ల లోపు ఉన్న యువ జంటల్లో మహిళలే ఎక్కువగా మోసం చేస్తున్నట్లు రికార్డులు చెబుతుండగా, వయసు 50 దాటిన తర్వాత పురుషులలో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది.