
హైదరాబాద్ గోల్కొండలో ఇటీవల జరిగిన సంచలనాత్మక హత్య కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. ప్రేమ వివాహం చేసుకున్న యువకుడిపై పగ పెంచుకున్న భార్య సోదరుడు, తన బంధువులు, కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోకి చొరబడి అత్యంత దారుణంగా హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా నివాసం ఉంటూ వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న బాధితడు మహబూబ్ 2025 జనవరిలో రుక్షార్ బేగంను ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే ఈ పెళ్లిని రుక్షార్ సోదరుడు షేక్ జాహెద్ తీవ్రంగా వ్యతిరేకించేవాడు.
దీంతో మహబూబ్‌పై తీవ్ర ద్వేషం పెంచుకున్న సోహైల్.. వాళ్లతో తరచూ గొడవలకు దిగేవాడు. కొన్ని రోజుల క్రితం కూడా తన తల్లి, సోదరితో కలిసి మృతుడి ఇంటికి వెళ్లి గొడవ పడి, తన సోదరిని అతనితో కాపురం చేయనివ్వనని హెచ్చరించినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ఈ క్రమంలోనే జూన్ 12న మధ్యాహ్నం సోహైల్, అతని బంధువులు జీషన్ నవాబ్, అమీర్ నవాబ్, నఫీజ్ సుల్తానాలతో కలిసి ఇనుప రాడ్లు, కత్తులు, కర్రలతో మహబూబ్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మహబూబ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
అయితే తన కొడుకును కొడుతున్నారనే అడ్డుకునేందుకు వెళ్లిన మహబూబ్ తండ్రిపై సైతం యువతి సోదరులు దాడి చేశారు. ఇక బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న గోల్కొండ పోలీసులు.. ప్రత్యేక బృందాల ద్వారా దర్యాప్తు చేపట్టి టోలిచౌకి ఏసీపీ సయ్యద్ ఫయాజ్ పర్యవేక్షణలో నలుగురు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.