
Floating AI Data Centres : ఒకప్పుడు డేటా సెంటర్ అంటే భూమిపై భారీ భవనం గుర్తొచ్చేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ కథే మారుతోంది. నేలపై చోటు తగ్గితే నీళ్లపైకి వెళ్లాలి… కరెంట్ సమస్య వస్తే సముద్రాన్నే సహాయకుడిగా మార్చుకోవాలి… ఏఐ ప్రపంచం పరుగులు పెడుతుంటే దానికి కావాల్సిన శక్తి కోసం సముద్రాలే కొత్త అడ్రస్‌గా మారబోతున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం వేగంగా పెరుగుతోంది. దీంతో భారీ స్థాయిలో డేటాను నిల్వ చేయడానికి, ప్రాసెస్ చేయడానికి మరిన్ని డేటా సెంటర్ల అవసరం ఏర్పడుతోంది. అయితే భూమిపై స్థలం కొరత, పెరుగుతున్న విద్యుత్ అవసరాలు, సర్వర్లను చల్లగా ఉంచేందుకు కావాల్సిన శీతలీకరణ వ్యవస్థలు టెక్ కంపెనీలకు పెద్ద సవాలుగా మారుతున్నాయి. ఈ పరిస్థితుల్లో దక్షిణ కొరియాకు చెందిన శామ్సంగ్ హెవీ ఇండస్ట్రీస్ ఒక కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. సముద్రంపై తేలియాడే ఏఐ డేటా సెంటర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
ఈ ప్రాజెక్టు కోసం శామ్సంగ్ హెవీ ఇండస్ట్రీస్ ఒంటరిగా పని చేయడం లేదు. గ్రీక్‌కు చెందిన క్యాపిటల్ క్లీన్ ఎనర్జీ క్యారియర్స్, సముద్ర భద్రతా ప్రమాణాల సంస్థ లాయిడ్స్ రెజిస్టర్‌తో కలిసి సంయుక్త అభివృద్ధి ఒప్పందం కుదుర్చుకుంది. గ్రీస్‌లో జరిగిన ప్రముఖ అంతర్జాతీయ షిప్పింగ్ ప్రదర్శన పోసిడోనియా 2026 సందర్భంగా ఈ భాగస్వామ్యాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇందులో శామ్సంగ్ డిజైన్, నిర్మాణ బాధ్యతలు చేపడుతుండగా, క్యాపిటల్ సంస్థ పెట్టుబడులు, ప్రాజెక్టు అభివృద్ధిని పర్యవేక్షించనుంది. లాయిడ్స్ రెజిస్టర్ భద్రతా ప్రమాణాలు, నియంత్రణ అంశాలపై దృష్టి సారించనుంది.
అసలు డేటా సెంటర్లను సముద్రంలో ఎందుకు ఏర్పాటు చేయాలనే ప్రశ్న చాలా మందికి రావచ్చు. కారణం చాలా సింపుల్. భారీ ఏఐ డేటా సెంటర్లకు విస్తారమైన స్థలం, నిరంతర విద్యుత్ సరఫరా, శక్తివంతమైన కూలింగ్ వ్యవస్థలు అవసరం. కానీ అమెరికా, యూరప్ వంటి ప్రాంతాల్లో భూమి అందుబాటు తగ్గిపోతోంది. విద్యుత్ గ్రిడ్ కనెక్షన్ల కోసం కూడా నెలలు కాదు, కొన్ని సందర్భాల్లో సంవత్సరాల పాటు ఎదురుచూడాల్సి వస్తోంది. అందుకే సముద్రంలో లేదా నదులపై తేలియాడే డేటా సెంటర్ల ఆలోచనకు ప్రాధాన్యం పెరుగుతోంది. ముఖ్యంగా సముద్రపు నీటినే నేరుగా శీతలీకరణ కోసం వినియోగించగలగడం వల్ల విద్యుత్ ఖర్చు కూడా భారీగా తగ్గే అవకాశం ఉంది.
శామ్సంగ్ అభివృద్ధి చేస్తున్న మొదటి ఫ్లోటింగ్ డేటా సెంటర్ సామర్థ్యం 50 మెగావాట్లు. ఇది వేల సంఖ్యలో ఏఐ సర్వర్లను ఒకేసారి నిర్వహించగలదు. విద్యుత్ విషయంలో కూడా దీనికి రెండు ప్రత్యామ్నాయాలు ఉంటాయి. తీర ప్రాంతాలకు సమీపంగా ఉన్నప్పుడు సముద్ర అడుగు భాగంలో వేసిన కేబుళ్ల ద్వారా విద్యుత్ గ్రిడ్‌కు అనుసంధానమవుతుంది. అవసరమైతే ద్రవీకృత సహజ వాయువుతో పనిచేసే సాలిడ్ ఆక్సైడ్ ఫ్యూయల్ సెల్స్ ద్వారా స్వయంగా విద్యుత్తును ఉత్పత్తి చేసుకునే సామర్థ్యం కూడా ఉంటుంది.
అయితే ఈ ఆలోచన ఎంత ఆకర్షణీయంగా కనిపించినా కొన్ని సవాళ్లు మాత్రం తప్పవు. సముద్రంలో నిరంతరం కదులుతున్న వేదికపై సున్నితమైన ఏఐ సర్వర్లను నిర్వహించడం అంత తేలిక కాదు. అలల ప్రభావం, కంపనాలు, ఉప్పునీటి కారణంగా ఏర్పడే తుప్పు, అధిక తేమ వంటి అంశాలు హార్డ్వేర్ పనితీరుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ సమస్యలకు పరిష్కారాలు కనుగొనేందుకు శామ్సంగ్ హెవీ ఇండస్ట్రీస్, సూపర్ మైక్రో సంస్థతో కలిసి పరిశోధనలు కొనసాగిస్తోంది. సముద్ర వాతావరణంలో సర్వర్లు ఎలా పనిచేస్తాయో పరీక్షలు నిర్వహిస్తోంది.
ఈ ప్రాజెక్టు టెక్నాలజీ రంగానికే కాదు, షిప్పింగ్ పరిశ్రమకు కూడా కొత్త అవకాశాలను తెరవొచ్చు. ఇప్పటి వరకు సరుకు రవాణాపైనే ఆధారపడిన ఓడ యజమానులు భవిష్యత్తులో టెక్ కంపెనీలు, క్లౌడ్ సేవల సంస్థలకు డేటా సెంటర్ సామర్థ్యాన్ని దీర్ఘకాలిక లీజుకు ఇచ్చి స్థిరమైన ఆదాయాన్ని సంపాదించే అవకాశం ఉంది.
ఈ రంగంలో శామ్సంగ్ మాత్రమే అడుగులు వేస్తోందని అనుకోవడం పొరపాటే. జపాన్‌కు చెందిన మిత్సుయి ఓఎస్‌కే లైన్స్ సంస్థ, టర్కీకి చెందిన కర్పవర్షిప్ కలిసి 73 మెగావాట్ల సామర్థ్యంతో తేలియాడే డేటా సెంటర్‌ను 2027 నాటికి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. మరోవైపు చైనాలో షాంఘై సమీపంలో 24 మెగావాట్ల నీటి అడుగున డేటా సెంటర్ ఇప్పటికే పూర్తిస్థాయిలో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. అమెరికాలో కాలిఫోర్నియాలో నాటిలస్ డేటా టెక్నాలజీస్ 6.5 మెగావాట్ల సామర్థ్యంతో బార్జ్ ఆధారిత డేటా సెంటర్‌ను నిర్వహిస్తోంది. నిజానికి ఒకప్పుడు ఓడలు సరుకును మాత్రమే మోసేవి. ఇప్పుడు అదే ఓడలు డేటాను మోయబోతున్నాయి. భవిష్యత్తులో ప్రపంచంలోని అతిపెద్ద ఏఐ వ్యవస్థలు భూమిపై కాదు, సముద్రాల మధ్యలో పనిచేసే రోజులు కూడా దూరంలో లేవనే సంకేతాలు ఈ ప్రాజెక్టులు ఇస్తున్నాయి.