
మహబూబ్‌నగర్ అర్బన్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి గడపకు చేరవేయాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ నగరంలోని ఓం కన్వెన్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, కార్పొరేటర్లకు నిర్వహించిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజల సమస్యలను తెలుసుకుని ప్రభుత్వ పథకాల అమలులో కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని సూచించారు.
గ్రామ, పట్టణ స్థాయిల్లో పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలంటే అంకితభావంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్‌ఎస్ పాలనతో పోలిస్తే రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమం, మహిళా సాధికారత, యువత ఉపాధి, విద్యారంగ అభివృద్ధిలో గణనీయ పురోగతి సాధించిందని చెప్పారు. కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సుభాష్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, మిథున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.