
దేశంలో నివసించే ప్రతీఒక్కరికి ఆధార్ కార్డుతో పాటు పాన్ కార్డ్ చాలా అవసరం. ఈ రెండు గుర్తింపు ధృవీకరణ పత్రాలు చాలా ముఖ్యమైనవి. ప్రభుత్వ పథకాలు, ప్రైవేట్ సేవలు పొందటంలో ఇవి చాలా ఉపయోగపడతాయి. బ్యాంకు ఖాతా తెరవడం నుండి ఆర్ధిక లావాదేవీలు చేయడం వరకు పాన్ కార్డు అనేది అవసరం. పాన్ కార్డు లేకపోపతే ఎలాంటి పెద్ద ఆర్థిక లావాదేవీలు చేయలేరు. కానీ పాన్ కార్డ్‌కు సంబంధించిన నియమ, నిబంధనల గురించి చాలామందికి పెద్దగా తెలియదు. మీరు కొన్ని పొరపాట్లు చేస్తే జైలుకు వెళ్లే అవకాశముంటుంది. అలాగే భారీగా జరిమానా కూడా చెల్లించాల్సి రావొచ్చు.
రెండు పాన్ కార్డులు ఉన్నాయా..?
భారత్‌లో చట్ట ప్రకారం ఒక వ్యక్తి పేరు మీద ఒక పాన్ కార్డు మాత్రమే ఉండాలి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 272బి ప్రకారం ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉండకూడదు. ఒకవేళ కలిగి ఉంటే రూ. 10 వేల జరిమానా విధిస్తారు.పన్ను ఎగవేత లేదా ఏ విధమైన మోసం కోసమైనా ఉద్దేశపూర్వకంగా రెండు వేర్వేరు పాన్ కార్డులను ఉపయోగిస్తే జైలు శిక్ష పడవచ్చు.
మీకు తెలియకుండా రెండు పాన్ కార్డులు ఉన్నాయా..?
సాంకేతిక లోపాల వల్ల లేదా మొదటిసారి పాన్ కార్డు పోగొట్టుకున్న తర్వాత తప్పుడు పద్ధతిలో మళ్లీ దరఖాస్తు చేసుకోవడం వల్ల రెండు పాన్ కార్డులు పొందుతారు. మీకు కూడా ఇలా జరిగి ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అదనపు పాన్ కార్డును వెంటనే ఆదాయపు పన్ను శాఖకు సమర్పించండి. ఇలాంటప్పుడు ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులు లేదా జరిమానాలు ఉండవు. ఆన్ లైన్ ద్వారా మీరు డీయాక్టివేట్ చేసుకోవచ్చు. అలాగే సమీపంలోని పాన్ కార్డు జారీ చేసే కార్యాలయానికి వెళ్లి కూడా డీయాక్టివేట్ చేసుకోవచ్చు. మీ దగ్గర రెండు పాన్ కార్డులు ఉంటే వెంటనే ఈ పని చేయండి.
పాన్ కార్డు నియమాలు
ఆదాయపు పన్ను శాఖ ఎప్పటికప్పుడు పాన్ కార్డ్ నియమాలు, నిబంధనల్లో మార్పులు చేస్తూ ఉంటుంది. పలు లావాదేవీలకు పాన్ కార్డు తప్పనిసరి చేసింది. దీంతో ఎప్పటికప్పుడు వీటి గురించి అవగాహన కలిగి ఉండాలి. లేకపోతే మీరు భారీగా నష్టపోవాల్సి ఉంటుది. పాన్ సేవలు పొందటంలో ఇబ్బందులకు గురి కావొచ్చు.