Reading Time: 2 minutes

కాగితం సంచి.. మంచిని కోరే కవితల సంచి.. బంధాలు, అనుబంధాల చుట్టూ అల్లిన కవితలు

Caption of Image.

సమాజంలో డబ్బు ప్రాధాన్యం పెరిగాక, ఆర్థిక అసమానతలు బంధాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఫలితంగా ఎదురువుతున్న సమకాలీన సమస్యలను ఇతివృత్తాలుగా తీసుకొని మలచిన కవిత్వమే ఈ ‘కాగితం సంచీ’ పుస్తకం. రచయిత్రి రాజేశ్వరి దివాకర్ల రాసిన ఈ కవితలన్నీ కుటుంబ/ సమాజ శ్రేయస్సును కోరేవే. మనుషులు/ వస్తువుల్లోని సుగుణాలను ఆధారంగా చేసుకుని బంధాలను, అనుబంధాలను పెంచుకునేలా అక్షరీకరించిన ఈ కవితలు ఆకట్టుకుంటాయి. మచ్చుకు కొన్ని ఉదాహరణలు.   

కుటుంబ బాధ్యతలు ఎన్ని ఉన్నా ఇంట్లోని ప్రతి ఒక్కరి బాగోగులపై అమ్మ ఒక కన్నేసి ఉంచుతుందని ‘ఎడమకన్ను అమ్మ’ కవిత చెబుతుంది. ‘ఎత్తు మడమల జోళ్లు కొని ఇస్తుంది/ అడుగు భద్రంగా వేయమని హెచ్చరిస్తుంది/ పొట్టి దుస్తుల అందాలను పొగుడుతుంది/ వయసు ఆవిరుల వేడికి కన్నీటి బుగ్గ దొరలి పోరాదని జాగ్రత్తలను తెలుపుతుంది’ అంటూ కాలానికి తగినట్లు  ఆడపిల్లలను పెంచుతూనే, వాళ్ల భద్రతను ఒక కంట కనిపెట్టుకునే తీరును వివరిస్తుంది. 

బతికి ఉన్నప్పుడు ‘ఆమె’ విలువ తెలుసుకోలేక, ‘ఆమె’ వల్లే తనకు విలువని తెలిసొచ్చాక ‘అతను’ పడే పశ్చాత్తాపానికి ‘ఒంటి స్తంభం మేడ’ కవిత దర్పణం. ‘ఆమెను సాగనంపి తిరిగి వచ్చాక/ కోల్పోయిన దానిని తెచ్చుకోలేక/ నాటుకున్న ఒంటి స్తంభం మేడలో అడుగుపెట్టలేక/ అంత పెద్ద మనిషీ చిన్నబోయాడు/ ఆమె చడీచప్పుడు చేయకనే తన నెదిరించిందని తెలుసుకున్నాక/ సగం శరీరంతో చిక్కిపోయాడు/ తన ప్రతిభను ఒడిసి పట్టేందుకు ఆమె లేక ఓడిపోయాడు’. చక్కటి భావుకత, ఆర్ద్రత అద్దిన పంక్తులివి. 

‘ఇంతకాలం తోడుగా ఉన్న మనిషి/ చిత్రపటమై పోయినప్పుడు/ తడిమి చూద్దామన్నా/ సరే లామినేషన్ అడ్డుతగులుతుంది’ అనే ‘శయన గాయం’ .. ఆత్మీయులను కోల్పోయినప్పుడు కలిగే బాధను గుండెను మెలిపెట్టేలా చెప్తుంది. నాన్న గురుతులను ‘కోవెల మంటపం’ వివరిస్తే.. నానమ్మ, అవ్వల ఆప్యాయతలను ‘కొంగు బంగారం’, ‘సంసార యోగం’ చెప్తాయి. మన సంప్రదాయాల్లోని గొప్పతనాన్ని చెప్పే ‘భగిని’, ‘చెమ్మకేళిల హోలీ’ అంతర్లీనంగా కలసి ఉండడంలోని మాధుర్యాన్ని వివరిస్తాయి. 

ఒకప్పుడు ఇంట్లోని అందరికీ ఒక్కటే నేస్తమైనప్పటికీ కాలక్రమంలో ఒక్కొక్కొరికీ ఒక్కొక్కటిగా విడిపోయిన వైనాన్ని ‘తువ్వాలు’, ‘సబ్బుబిళ్ల’ కవితలు వివరిస్తాయి. ఉమ్మడి కుటుంబంలోని అనుబంధానికి క్రమంగా దూరమైన విషయాన్ని చెప్తాయి. మధ్య తరగతి కుటుంబాల్లోని బంధాలు, అనుబంధాల చుట్టూ అల్లిన కవితలివి. భాష సరళంగా సాగుతూనే అవసరమైన చోట సంస్కృత పదాలను అమర్చుకుంది. వచన కవిత్వాన్ని ఇష్టపడేవాళ్లకు ‘కాగితం సంచీ’ నచ్చుతుంది.

– జి. మహేశ్వర్-

పేజీలు : 116 ; వెల : 150
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు

 

©️ VIL Media Pvt Ltd.