Reading Time: 2 minutes
CM Chandrababu: సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు కీలక భేటీ.. పెట్టుబడులే లక్ష్యంగా సాగిన మీటింగ్!

సింగపూర్ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు.. ఆ దేశ ప్రధాని మంత్రి లారెన్స్‌ వాంగ్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనతో పలు కీలక అంశాలపై చర్చించారు. టెక్నాలజీ, సెమీకండక్టర్లు, క్వాంటం, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహా యూనివర్సిటీల్లో పరిశోధనలకు సంబంధించి సహకారం అందించాలని వాంగ్‌ను సీఎం చంద్రబాబు కోరారు. సెమీ కండక్టర్ల తయారీ ఎకోసిస్టమ్, కెపాసిటి బిల్డింగ్‌లో తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. అమరావతి సహా రాష్ట్రంలోని వివిధ నగర, పట్టణ ప్రాంతాల్లో అర్బన్ గవర్నెన్స్‌లోనూ సహకారం కోరుతున్నట్టు సీఎం తెలిపారు. ఏపీలో ప్రకృతి సేద్యం ద్వారా పంటలు పండిస్తున్నట్టు సింగపూర్ ప్రధానికి సీఎం వివరించారు.

ఏపీలోని ఉద్యాన, ఆక్వా ఉత్పత్తులను సింగపూర్ దిగుమతి చేసుకునే అంశాన్ని పరిశీలించాలని సీఎం ప్రత్యేకంగా కోరారు. ప్రకృతి సేద్యం ద్వారా సాగైన ఉత్పత్తులకు సర్టిఫికేషన్, ట్రేసబిలిటీ సాధించేలా ప్రయత్నాలు చేస్తున్నామని ఆయనకు తెలిపారు. పోర్టులు- ఎయిర్ పోర్టుల అభివృద్ధితో పాటు వివిధ అవకాశాలను అందిపుచ్చుకునేలా ఏపీ-సింగపూర్‌లు కలిసి పనిచేయాలని అన్నారు. అలాగే వాంగ్‌ కూడా అమరావతి రాజధాని నిర్మాణాల గురించి సీఎం చంద్రబాబును ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. రాజధానిలో విద్యాసంస్థలు, మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో చేపడుతున్న నిర్మాణాల గురించి ఆసక్తిగా అడిగారు.

అమరావతి అత్యంత నివాసయోగ్యమైన నగరాల సరసన చేరనుందని వాంగ్‌కు సీఎం తెలిపారు. ఏపీలో ప్రజారోగ్యానికి సంబంధించి మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పాపులేషన్ మేనేజ్‌మెంట్ గురించి ముఖ్యమంత్రి వివరించారు. 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసే దిశగా ఏపీ ముందుకు వెళుతుందని సింగపూర్ ప్రధానికి తెలిపారు. అనంతరం ప్రపంచ వ్యాప్తంగా జనాభా తగ్గుదల అంశంపై ఇరువురు నేతలు కొద్ది సేపు చర్చించుకున్నారు. అందుబాటులో గృహ నిర్మాణం, శిశువులు, చిన్నారుల సంరక్షణ లాంటి చర్యలపై నేతల మధ్య చర్చ చోటు చేసుకుంది. సేవల రంగం తరహాలోనే తయారీ, సప్లై చైన్ రంగాలు కూడా భారత్‌లో విస్తృతం అవుతాయని ఇరువురు నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఏపీలో భూ లభ్యత- మానవ వనరులు

సింగపూర్ ప్రధానితో భేటీ అనంతరం సీఎం చంద్రబాబు ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి వివియన్ బాలకృష్ణన్‌తో సమావేశం అయ్యారు. ఆంధ్రప్రదేశ్ – సింగపూర్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాలపై ఇరువురు మధ్య చర్చ జరిగింది. ఏపీ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు, వివిధ విమానాశ్రయాలకు ఎయిర్ కనెక్టివిటీపై చర్చించారు. అమరావతి రాజధాని నిర్మాణాలకు సంబంధించిన అంశాలను సింగపూర్ విదేశీ వ్యవహారాల మంత్రికి సీఎం వివరించారు. తయారీ రంగంతో పాటు సేవల రంగంలోనూ ఏపీ అగ్రగామి రాష్ట్రంగా అవతరిస్తోందని తెలియచేశారు. పరిశ్రమల ఏర్పాటుకు భూమి లభ్యతతో పాటు సేవల రంగంలో నిపుణులైన మానవ వనరులు ఏపీలో ఉన్నాయని ముఖ్యమంత్రి వివరించారు.

గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ హైడ్రోజన్ తయారీలో ఏపీ కీలకంగా ఉందని సీఎం స్పష్టం చేశారు. ఏపీకి ఉన్న సుదీర్ఘ తీరప్రాంతంతో పాటు, సరకు రవాణాకు పోర్టులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. విశాఖలో డేటా సెంటర్ ఎకోసిస్టమ్‌తో పాటు ఇంటర్నెట్ సహా డేటా సేవల కోసం సబ్ సీ కేబుల్‌ను ఏపీ నుంచి ప్రపంచానికి కనెక్ట్ చేస్తున్నారని తెలిపారు. అమరావతిని క్వాంటం వ్యాలీగా తీర్చిదిద్దుతున్నామని.. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రపంచ దిగ్గజ స్టీల్ తయారీ సంస్థ ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తోందని సింగపూర్ విదేశీ వ్యవహారాల మంత్రికి వివరించారు. ఈ సమావేశంలో ఏపీ పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, సింగపూర్‌లో భారత హై కమిషనర్ శిల్పక్ అంబులే తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.