
ఫ్రాన్స్‌లో జీ 7 సదస్సు వేదికగా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. హార్ముజ్ శాశ్వతంగా టోల్ రహితంగా ఉంటుందని వెల్లడించారు. సమ్మిట్‌ను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగం చేశారు. ఇరాన్‌తో కుదిరిన శాంతి ఒప్పందంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి శుక్రవారం నాటికి పూర్తిగా తెరుచుకుంటుందని.. ఇకపై అది శాశ్వతంగా టోల్ ఫ్రీగా అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. అలాగే ఇరాన్‌తో కుదిరిన అవగాహన ఒప్పందం (MoU) పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తానని.. దీనిపై ప్రత్యేకంగా మీడియా సమావేశం కూడా నిర్వహిస్తానని తెలిపారు.
ఇరాన్‌తో కుదిరిన ఈ ఒప్పందాన్ని అమెరికా కాంగ్రెస్ పరిశీలనకు పంపనున్నట్లు ట్రంప్ చెప్పారు. ఈ ఒప్పందంలో ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయబోదని స్పష్టంగా పేర్కొన్నామని వెల్లడించారు. ఇరాన్‌తో చర్చల తొలి దశ విజయవంతంగా పూర్తైందని.. రెండో దశ చర్చలు మరింత వేగంగా పూర్తవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇరాన్ ఒప్పందానికి సంబంధించిన పూర్తి పాఠ్యాన్ని అధికారిక కార్యక్రమంలో విడుదల చేస్తానని వెల్లడించారు. అమెరికా-ఇరాన్ మధ్య ఇటీవల కుదిరిన శాంతి ఒప్పందం ప్రపంచ రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి పునఃప్రారంభం ప్రపంచ ఇంధన మార్కెట్లకు ఊరటనివ్వనుంది.
ఇదిలా ఉండగా.. ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ కీలక ప్రకటన చేసింది. అమెరికాతో ఒప్పందం అనంతరం ఇరాన్‌కు చెందిన చమురు ట్యాంకర్లు, ఇతర వాణిజ్య నౌకలు మళ్లీ సముద్ర మార్గంలో ప్రయాణాలు ప్రారంభించాయని వెల్లడించింది. అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధనం సడలింపుకు ఇది సంకేతమని పేర్కొంది. ప్రస్తుతం మూడు ఇరానియన్ చమురు ట్యాంకర్లు ఉత్తర హిందూ మహాసముద్రంలో ప్రయాణిస్తుండగా.. మరో రెండు నౌకలు అవసరమైన సరుకులు, పశువుల మేతతో దక్షిణ ఇరాన్ నౌకాశ్రయాల వైపు వెళ్తున్నాయని ఇరాన్ మీడియా తెలిపింది.
ఏప్రిల్ 13 నుంచి అమల్లో ఉన్న అమెరికా నౌకాదళ ఆంక్షల నేపథ్యంలో ఇరాన్ నౌకల రాకపోకలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అయితే తాజా ఒప్పందంతో ఆ దిగ్బంధనాన్ని ఎత్తివేసే ప్రక్రియ అమలులోకి వచ్చిందని ఇరాన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామం ప్రపంచ చమురు సరఫరా వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.