
Off The Record: తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త… పాత పేరుతో అంతులేని కథ నడుస్తూనే ఉంది. ఈ లొల్లి ఎప్పటికి ఎండ్ అవుతుందో కూడా కనీస క్లారిటీ లేకపోగా… ఎప్పటికప్పుడు కొత్త రూపు సంతరించుకుంటూనే ఉంది. ఏదో ఒక రూపంలో, ఎక్కడో ఒక చోట వివాదం రేగుతూనే ఉంది. జిల్లాల గొడవలు అప్పుడప్పుడూ హైదరాబాద్ గాంధీభన్‌ను తాకుతూనే ఉన్నాయి. తాజాగా ఈ వ్యవహారం ఏకంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆందోళన వరకు వచ్చింది. సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ, అలాగే పంచాయితీలు కూడా పెరుగుతూ ఉంటాయి. నల్గొండ, మెదక్, వరంగల్ జిల్లాల్లో ఈ లొల్లి మరీ తీవ్రంగా ఉంటుంది. దీనికి తోడు… బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెల్‌లో చేరిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లో పాత కొత్త నేతల పంచాయితీ ఇంకా తీవ్రంగా ఉంటుంది. సాధారణంగా వివాదాలు రేగినప్పుడు నియోజకవర్గ ఇన్చార్జ్‌ల స్థాయిలో నాయకులని ఒప్పించే ప్రయత్నం చేస్తుంటారు. పదవులు పంపకంలో సమన్వయం చేస్తూ సయోధ్యకుదురుస్తామని మాటిస్తుంటారు. కానీ… రానురాను అలాంటి హామీలేవీ అమలవడం లేదని, పెద్దల మాటలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయన్న అసంతృప్తి కేడర్‌లో పెరిగిపోతోంది. తాజాగా గాంధీభవన్‌లో జహీరాబాద్ నాయకులు చేసిన ఆందోళనే ఇందుకు నిదర్శనం అన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.
గతంలో ఇక్కడి నుంచి మాజీ మంత్రి గీతారెడ్డి ప్రాతినిధ్యం వహించారు. గత ఎన్నికల్లో ఆమెకు కాకుండా… మరో మాజీ మంత్రి చంద్రశేఖర్‌కు ఆ నియోజకవర్గ టిక్కెట్ ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. దీంతో… ఇప్పుడు ఇరువర్గాల మధ్య పోరు నడుస్తోంది. రెండు పక్షాల మధ్య సయోధ్య కుదురుస్తూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితిలో పార్టీ పెద్దలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఏకంగా గాంధీభన్‌లోని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌గౌడ్ ఛాంబర్ ముందే ఆందోళన నిర్వహించారు నియోజకవర్గ నాయకులు. పాత వాళ్లను పక్కనపెట్టి కొత్తగా వచ్చిన వారికి పదవులు ఇస్తున్నారన్నది ఆందోళనకారుల మాట. పార్టీలో ఏం జరుగుతోందో ఈ ఆందోళనేనిదర్శనం అన్న అభిప్రాయం ఉంది. గతంలో ఖమ్మం జిల్లా పంచాయితీ కూడా ఇదే తరహాలో గాంధీభవన్‌కు చేరింది. వివిధ కులాల కార్పొరేషన్ చైర్మన్ పదవులు ప్రకటించినప్పుడు ఇదే తరహా నిరసన వ్యక్తమైంది. పార్టీ కోసం పని చేసినవారికి కాకుండా కొత్త వారికి పదవులు ఇస్తున్నారంటూ అప్పుడు కూడా గాంధీభవన్‌కు వచ్చి నిరసన తెలిపారు.
మొన్న హైదరాబాద్ పార్లమెంట్ నేతలు సమావేశంలో గొడవ వెనక కూడా సయోధ్య లేమి..సమన్వయ లోపం కనపడిందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. కాంగ్రెస్‌కి బలమే క్యాడర్. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే నాయకులు అసంతృప్తికి గురికాకుండా చూడాల్సిన బాధ్యత నాయకత్వంపై ఉంది. పాత కొత్త నేతలను సమన్వయ పరుస్తూ ముందడుగు వేయాల్సి ఉంది. అయినా… లైట్ తీసుకుంటుండటంతో….పంచాయితీలు గాంధీభవన్‌దాకా వస్తున్నాయని అంటున్నారు. మరీ ముఖ్యంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నచోట్లే ఇలాంటి వివాదాలు పెరిగిపోతున్నాయట. అధిష్టానం ఈ సమస్య మీద ఫోకస్ పెట్టకుంటే… మొదటికే మోసం వస్తుందన్న హెచ్చరికలు సైతం పెరుగుతున్నాయి.