Reading Time: 2 minutes

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కు చేదు అనుభవం.. స్పీచ్ ఇస్తుండగా 200 మంది విద్యార్థుల వాకౌట్!

Caption of Image.

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కు స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ 2026 గ్రాడ్యుయేషన్ సెర్మనీలో ఊహించని చేదు అనుభవం ఎదురైంది. ఆయన స్టేజ్ పైకి వస్తున్న సమయంలో సుమారు 200 మంది విద్యార్థులు ఒక్కసారిగా నిరసనకు దిగారు.

సుందర్  పిచాయ్‌ను పరిచయం చేస్తున్నప్పుడు విద్యార్థులు వారి సీట్లలోంచి లేచి నిలబడి, పాలస్తీనా జెండాలు ఊపుతూ, ఈలలు వేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పాలస్తీనియన్లకు మద్దతుగా చాలామంది  ‘కెఫియా’లను ధరించి కనిపించారు.

అంతటితో ఆగకుండా, విద్యార్థులు గ్రాడ్యుయేషన్ గౌన్లు, టోపీలతోనే స్టేడియం నుండి బయటకు వాకౌట్ చేశారు. అయినసరే ఇదే స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న సుందర్ పిచాయ్ ఏమాత్రం తడబడకుండా తన ప్రసంగాన్ని కొనసాగించారు.

నిరసన ఎందుకు?
గూగుల్ సంస్థ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF), అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ, ICEలతో కుదుర్చుకున్న ఒప్పందాలకు వ్యతిరేకంగా ఈ నిరసన జరిగింది. ‘స్టూడెంట్స్ ఫర్ జస్టిస్ ఇన్ పాలస్తీన్’, ‘నో టెక్ ఫర్ అపార్టెడ్’ అనే సంస్థలు ఈ వాకౌట్‌ను నడిపించాయి.

ముఖ్యంగా గూగుల్, ఇజ్రాయెల్ ప్రభుత్వం మధ్య కుదిరిన దాదాపు 10వేల కోట్ల రూపాయల ‘ప్రాజెక్ట్ నింబస్’ క్లౌడ్-కంప్యూటింగ్ ఒప్పందమే ఈ వివాదానికి కారణం. గూగుల్ దాని టెక్నాలజీ ద్వారా ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తోందని పాలస్తీనా అనుకూల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

‘పీపుల్స్ కమెన్స్‌మెంట్’ పేరుతో ఈవెంట్
యూనివర్సిటీ వేడుక నుండి బయటకు వచ్చేసిన విద్యార్థులు “పీపుల్స్ కమెన్స్‌మెంట్” పేరుతో విడిగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. ఇందులో మహమూద్ ఖలీల్ అనే వ్యక్తి  మాట్లాడారు.

ఈ ఖలీల్ ఎవరో కాదు… 2024లో కొలంబియా విశ్వవిద్యాలయంలో పాలస్తీనాకు మద్దతుగా ఆందోళనలు చేసినందుకు అమెరికా అధికారులు ఇతడిని 100 రోజులకు పైగా నిర్బందించారు. 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పై మౌనం
విచిత్రం ఏంటంటే, సుందర్ పిచాయ్ తన ప్రసంగంలో ఎక్కడా కూడా AI గురించి మాట్లాడలేదు. ప్రస్తుతం టెక్ ప్రపంచంలో ఉద్యోగాల కోతలు ఎక్కువగా ఉండటం, ఏఐ వల్ల ఉద్యోగాలు ఊడిపోతాయేమోనని విద్యార్థులు భయపడుతుండటమే దీనికి కారణం కావచ్చు.

 ఈ మధ్య మిగతా టెక్ కంపెనీల బాస్‌లు ఏఐ గురించి గొప్పగా మాట్లాడినప్పుడు విద్యార్థుల నుండి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ ఏడాది మొదట్లో, గూగుల్ మాజీ సీఈఓ ఎరిక్ ష్మిత్‌తో పాటు మరికొందరు టెక్ నిపుణులు కాలేజీ వేడుకల్లో ఏఐని ప్రచారం చేసినందుకు విద్యార్థుల నుండి విమర్శలు ఎదుర్కొన్నారు. 

విమర్శలపై పిచాయ్ ఏమన్నారంటే 
గత నెలలోనే ‘హార్డ్ ఫోర్క్’ అనే టెక్ పాడ్‌కాస్ట్‌లో పిచాయ్‌ను “స్టాన్‌ఫోర్డ్‌లో స్పీచ్ ఇచ్చేటప్పుడు విద్యార్థులు మిమ్మల్ని ఎగతాళి చేస్తే ఎలా తట్టుకుంటారు?” అని ఒక ప్రశ్న అడిగారు. దానికి పిచాయ్ చాలా పాజిటివ్‌గా సమాధానమిచ్చారు. యువతపై, వారి భవిష్యత్తుపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. ఇప్పుడు ఏఐని విమర్శిస్తున్న విద్యార్థులే రేపటి రోజున ఈ టెక్నాలజీని సరైన దారిలో పెట్టడానికి సాయపడతారని చెప్పారు.

“నాకు ఎప్పుడూ నెక్స్ట్ జనరేషన్ మీద చాల నమ్మకం, ఆశలు ఉన్నాయి. ఏఐ వచ్చినా ఆ నమ్మకం మారదు. టెక్నాలజీని ముందుకు తీసుకెళ్లడంలోనూ, దాని వల్ల వచ్చే సమస్యలను ఎదుర్కోవడంలోనూ ఈ గ్రాడ్యుయేట్లే కీలక పాత్ర పోషిస్తారు అని పిచాయ్ స్పష్టం చేశారు.

 

©️ VIL Media Pvt Ltd.