
Sanchita Ugale : మరాఠీ నటి సంచితా ఉగలే ఆకస్మిక మరణం చుట్టూ ఇప్పుడు కొత్త వివాదం నెలకొంది. ఆమె సోదరుడు ఆకాష్ సతీష్ ఉగలే చేసిన ఆరోపణలు ఈ విషాద ఘటనను మరింత చర్చనీయాంశంగా మార్చాయి. ముఖ్యంగా బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో తన సోదరి మరణానికి పోలికలు ఉన్నాయని ఆయన చెప్పడం సంచలనంగా మారింది.
ఆకాష్ ఉగలే అభిప్రాయం ప్రకారం, సంచితా ఉగలే, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇద్దరూ సనీ పరిశ్రమలో తీవ్రమైన ఒత్తిళ్లకు బలయ్యారని ఆయన ఆరోపిస్తున్నారు. తన సోదరి మరణం కేవలం వ్యక్తిగత కారణాల వల్ల కాదని, పరిశ్రమలోని పరిస్థితులు కూడా ఇందుకు కారణమని ఆయన ఆరోపించారు. 2020 జూన్ 14న సుశాంత్ చనిపోగా, సంచితా ఉగలే కూడా రెండురోజుల క్రితం ఇదే తేదీన చనిపోయింది. ఈ రెండు విషాద ఘటనలు ఒకే తేదీన జరగడం ఆయన అనుమానాలకు తావిస్తోంది.
ఈ ఘటనలో మరో ఆసక్తికర అంశం సంచితా ఉగలే సోషల్ మీడియా. మరణానికి ముందు రోజు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో “మళ్లీ జూన్ 14 వచ్చింది” అనే పోస్ట్ ను షేర్ చేసినట్లు సమాచారం. అది సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ వర్ధంతికి సంబంధించిన పోస్టు కావడం ఇప్పుడు చర్చకు దారితీసింది. ఈ పోస్ట్‌ను ప్రస్తావిస్తూ ఆకాష్ ఉగలే, తన సోదరి మరణానికి కారణం డీప్ గా పరిశీలించాలని కోరుతున్నారు.
మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆకాష్ మాట్లాడుతూ, సుశాంత్‌పై గతంలో వచ్చిన ఆరోపణల మాదిరిగానే తన సోదరి కూడా తీవ్రమైన ఒత్తిళ్లను ఎదుర్కొన్నారని అన్నారు. ఆయన అభిప్రాయం ప్రకారం, ఈ రెండు మరణాల వెనుక ఉన్న పరిస్థితులను కేవలం యాదృచ్ఛిక సంఘటనలుగా చూడకూడదని చెప్పారు. ఇదే కారణంగా ఆయన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో పాటు ఇతర రాష్ట్ర నాయకులను ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, సంచితా ఉగలే ముంబై సమీపంలోని నాలాసోపారా తూర్పు ప్రాంతంలో ఉన్న తన నివాసంలో జూన్ 14 సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నట్లు నమోదు చేశారు. ఘటనకు సంబంధించిన విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. అయితే ఆమె కుటుంబ సభ్యులు మరింత లోతైన దర్యాప్తు అవసరమని భావిస్తున్నారు.
ఇక సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం ఇప్పటికీ దేశవ్యాప్తంగా చర్చకు కారణమవుతూనే ఉంది. 2020 జూన్ 14న ముంబైలోని తన నివాసంలో ఆయన మృతదేహం లభించడం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అనంతరం జరిగిన పోస్ట్‌మార్టం ప్రకారం ఉరి వేసుకోవడం వల్ల ఊపిరాడక మరణించినట్లు వెల్లడైంది. అయితే ఆయన మరణం చుట్టూ వివిధ కోణాల్లో అనేక చర్చలు, దర్యాప్తులు, ప్రజా స్పందనలు కొనసాగాయి. ఇప్పుడు సంచితా ఉగలే మరణం నేపథ్యంలో ఆమె సోదరుడు చేసిన వ్యాఖ్యలు మరోసారి సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ అయ్యాయి.