
ముషీరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చాలని తెలంగాణ ఆర్టీసీ ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక వ్యవస్థాపక చైర్మన్ గోధుమల కుమారస్వామి కోరారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆకాంక్షల వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సమావేశానికి తెలంగాణ విఠల్, పాశం యాదగిరి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు కీలకపాత్ర పోషిస్తే, రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలకులు కార్మికుల ఆశలను వమ్ము చేశారని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులను యూనియన్లు మోసం చేస్తూనే ఉన్నాయని, దీంతో కార్మికుల బతుకులు అధ్వానంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు, సౌలతులు వస్తాయని ఆశించిన కార్మికులను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికులకు, ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. హనుమంతు ముదిరాజ్, జక్కుల మల్లేశం, సాజిద్, రవి కిరణ్, పాండు, శ్రీపాల్ బాబు, రాజయ్య నాయక్, రాజేందర్, నరేందర్, హేమలత, జమున, లావణ్య పాల్గొన్నారు.