
హైదరాబాద్ సిటీ, వెలుగు: భారీ వర్షాల నేపథ్యంలో టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేశ్ వి. పాటిల్ ఆదివారం హైదరాబాద్ పాతబస్తీలో పర్యటించి కరెంట్ సమస్యలను పరిశీలించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, భారీ వర్షాలు, అత్యవసర పరిస్థితులు తలెత్తితే అంతరాయం లేకుండా కరెంట్ సరఫరా కొనసాగించేలా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.
ఈ నెలలో నిర్వహించనున్న బీబీ కా ఆలం ఊరేగింపు మార్గాన్ని సీఎండీ పరిశీలించారు. మొహర్రం సందర్భంగా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించాలని, అవసరమైతే అదనపు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అస్మాన్‌గఢ్ ప్రాంతాన్ని విజిట్ చేశారు. చీఫ్ ఇంజినీర్(మెట్రో జోన్) భిక్షపతి, హైదరాబాద్ సౌత్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్రీనివాస్, అస్మాన్‌గఢ్ డివిజనల్ ఇంజినీర్ విష్ణువర్ధన్, చార్మినార్ డివిజనల్ ఇంజినీర్ శ్రీధర్ పాల్గొన్నారు.
సబ్ స్టేషన్ తనిఖీ..
నారాయణగూడ: టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేశ్ వి పాటిల్ శనివారం రాత్రి హిమాయత్‌నగర్ సబ్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యుత్ సరఫరా, సబ్ స్టేషన్ పనితీరు, నిర్వహణను పరిశీలించారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థను సమీక్షించడంతో పాటు సిబ్బందితో మాట్లాడి క్షేత్ర స్థాయి పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.