Reading Time: < 1 minute
Ill Get You Movie Roles Actress Harassed With Demands To Satisfy Sexual Desires

సినిమాపై ఉన్న ప్రేమతో వెండితెరపై ఓ వెలుగు వెలగాలని ఎందరో నటీనటులు చిత్ర పరిశ్రమలో అడుగుపెడుతుంటారు. కానీ వారికీ ఇక్కడ అనుకోని అవరోధాలు, లైంగిక వేధింపులు వంటి చర్యలతో విసిగి చిత్ర పరిశ్రమ వదిలేస్తున్నారు. తాజాగా చిత్ర పరిశ్రమలో మరో ఉదంతం వెలుగుచూసింది. సినిమా అవకాశాలు కల్పిస్తానంటూ మోసానికి గురిచేయడమే కాకుండా, లైంగికంగా వేధించాడనే ఆరోపణలపై ఒక క్యాస్టింగ్ ఆర్టిస్ట్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బాధితురాలైన ఓ సినీ నటి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

పోలీసుల కథనం ప్రకారం… క్యాస్టింగ్ ఆర్టిస్ట్‌గా పనిచేసే ప్రసాద్ అనే వ్యక్తి, బాధితురాలికి ఆకాశంలో ఒకతార అనే సినిమాలో  హీరోయిన్ స్నేహితురాలి పాత్ర ఇప్పిస్తానని చెప్పి పరిచయమయ్యాడు. పాత్ర నచ్చడంతో ఆ నటి వెంటనే అంగీకరించి 2025 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు జరిగిన షూట్ లో పాల్గొని తన రోల్ ఫీనిష్ చేసింది. అయితే షూటింగ్  ఫినిష్ చేసినప్పటికీ తనకి రావాల్సిన రూ. 90 వేల పారితోషికం   అలాగే రూ. 38 వేల ప్రయాణ ఖర్చులను ఇవ్వకుండా ప్రసాద్ కాలయాపన చేస్తూ వచ్చాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో బకాయి డబ్బుల విషయమై మాట్లాడటానికి బంజారాహిల్స్‌లోని ఓ ప్రముఖ సినీ నిర్మాత కార్యాలయం వద్దకు రావాలని బాధితురాలిని ప్రసాద్ పిలిపించాడు. అక్కడికి వెళ్లిన ఆ నటికి డబ్బులు ఇవ్వకపోగా బెదిరింపులకు దిగాడు. అంతేకాకుండా ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లి.. మరిన్ని సినిమా అవకాశాలు ఇప్పిస్తానని అందుకు తన కోరికలు తీర్చాలంటూ అసభ్యంగా ప్రవర్తించాడని బాధితురాలు ఆరోపించింది. ఈ వేధింపులపై తీవ్ర మనస్తాపానికి గురైన నటి, బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు క్యాస్టింగ్ ఆర్టిస్ట్ ప్రసాద్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.