Reading Time: < 1 minute
Abhijeet Dipke Slapped Jaipur Cockroach Janata Party Protest Neet Paper Leak

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. పార్టీ నాయకుడు అభిజీత్ దీప్కేపై ఓ వ్యక్తి దాడి చేశాడు. నాలుగు సార్లు చెంపదెబ్బలు కొట్టాడు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. వెంటనే నిరసనకారులు.. దుండగుడిని చితకబాదారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సమాచారం ప్రకారం.. జైపూర్‌లోని షహీద్ స్మారక్ దగ్గర కాక్రోచ్ పార్టీ నిరసన కార్యక్రమం ప్రారంభంకాక ముందే ఈ ఘటన చోటుచేసుకుంది. అభిజీత్ దీప్కే కార్యక్రమ స్థలానికి చేరుకుని అక్కడికి వచ్చిన మద్దతుదారులకు అభివాదం చేస్తుండగా.. జనసమూహంలో ఉన్న ఓ వ్యక్తి అకస్మాత్తుగా ముందుకు వచ్చి వరుసగా నాలుగు సార్లు చెంపదెబ్బలు కొట్టాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు వెంటనే దాడి చేసిన వ్యక్తిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని నియంత్రించారు. ఘటనకు సంబంధించి ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దాడి వెనుక ఉన్న కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

అవినీతి, నీట్ పేపర్ లీకేజీలపై నిరసన
పరీక్షల అవకతవకలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం వంటి సమస్యలపై కాక్రోచ్ జనతా పార్టీ ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. నిరసనకారులు అవినీతి వ్యతిరేక నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శించారు. అలాగే యువత సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కూడా నిరసనకారులు నినాదాలు చేశారు.