Reading Time: < 1 minute
Viral News: కళ్లు జిగేల్..! రోడ్డు పక్క దొరికినవి పురాతన బంగారు నాణేలా?

తమిళనాడులోని సేలం ప్రాంతంలో ఈ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రోడ్డు పక్క తళతళ మెరుస్తూ చిన్నచిన్న నాణేలు కనిపించడం స్థానికంగా సంచలనంగా మారింది. ఉదయం వేళ రోడ్డుపై వెళ్తున్న స్థానికులు చిన్నచిన్న నాణేలను గుర్తించి తమ వెంట కొన్ని తీసుకెళ్లారు. రోడ్డు పక్క బంగారు నాణాలు కనిపించాయని వారు ఇచ్చిన సమాచారంతో కొద్దిసేపట్లోనే అక్కడికి సమీప గ్రామాల వారు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. నాణేల కోసం పోటాపోటీగా వెతుకులాట మొదలుపెట్టారు. కొందరు తమకు దొరికిన చిన్నచిన్న నాణేలను తమ వెంట తీసుకెళ్లారు.

రోడ్డు పక్క చెల్లాచెదురుగా కనిపించిన ఈ నాణేలు పురాతన కాలానికి చెందిన బంగారు నాణాలు కావొచ్చని కొందరు భావిస్తున్నారు. మరికొందరు ఇవి సాధారణ రాగి నాణేలేనని అభిప్రాయపడ్డారు. ఆ నాణేలు ఎలా అక్కడికి వచ్చాయన్న విషయంలో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొందరు గుప్తనిధిని వెలికితీసే క్రమంలో ఈ నాణేలు బయటపడి ఉండొచ్చని భావిస్తున్నారు. మరికొందరు ఎవరో సేకరించిన నాణేలు అనుకోకుండా రోడ్డుపై పడిపోయి ఉండవచ్చని పేర్కొన్నారు.

అటు రోడ్డు పక్క బంగారు నాణేలు కనిపించాయన్న సమాచారంతో స్థానిక రాసిపురం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ జరిపారు. అక్కడ దొరికిన కొన్ని చిన్నచిన్న నాణాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ నాణేలపై 1914 సంవత్సరం, విక్టోరియా మహారాణి పేరు, చిత్రం ఉంది. ఆ నాణేలు అక్కడకు ఎలా వచ్చాయన్న దానిపై దర్యాప్తు జరుపుతున్నారు.

నాణేలా? బంగారు పూతపూసిన నకిలీ నాణేలా?

రోడ్డు పక్క దొరికినవి పురాతన కాలంనాటి బంగారు నాణేలా? బంగారు పూతపూసిన నకిలీ నాణేలా? లేక పురాతన రాగి నాణేలా? ఆ నాణేలాను అక్కడ ఎవరు పడేశారు? అనే అంశాలపై పోలీసుల విచారణ జరుపుతున్నారు. ఆ పురాతన నాణేల చారిత్రక నేపథ్యం గురించి పురావస్తు నిపుణుల పరిశీలన తర్వాతే తెలిసే అవకాశముందని పోలీసులు తెలిపారు.

ఈ ఘటన స్థానిక ప్రజల్లో ఆసక్తిని రేకెత్తించగా.. అక్కడ దొరికినవి బంగారు నాణేలని ప్రచారం జరగడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిపుణుల నివేదికల అనంతరం ఈ నాణేలు చారిత్రక విలువ కలిగినవా? లేక సాధారణ వినియోగ నాణేలేనా? అన్నది స్పష్టత రానుంది.

Also Read: శంభో శంకర..కొత్తింటికి పునాది తవ్వుతుండగా కనిపించిన అద్భుత దృశ్యం