Reading Time: 2 minutes

ఇంజినీరింగ్లో కొత్తగా 15 వేల సీట్లు..పర్మిషన్ ఇస్తేనే కౌన్సెలింగ్‌‌లోకి..

Caption of Image.
  •     రాష్ట్రంలో 179 కాలేజీలకు ఏఐసీటీఈ అనుమతి
  •     మొత్తం సీట్లు 1.38 లక్షలు.. 70 శాతం కంప్యూటర్ కోర్సులే 
  •     సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే కౌన్సెలింగ్‌‌‌‌లో అవకాశం 
  •     ఈ నెల 19 నుంచి ఎప్ సెట్ అడ్మిషన్ల ప్రక్రియ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంజినీరింగ్ కాలేజీల్లో ఈ ఏడాది సీట్ల సంఖ్య పెంచుతూ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) నిర్ణయం తీసుకుంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి అదనంగా 15 వేల సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని 179 ఇంజినీరింగ్ కాలేజీలకు అనుమతులు మంజూరు చేసింది. వీటిలో మొత్తం 1.38 లక్షల సీట్లను ఏఐసీటీఈ అప్రూవ్ చేసింది. ఈ మేరకు తాజాగా టెక్నికల్ ఎడ్యుకేషన్ అధికారులకు ఏఐసీటీఈ వివరాలు పంపించింది. ఈ నెల 19 నుంచి ఎప్ సెట్ ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. గత ఏడాది విద్యాశాఖ అధికారులు 1.23 లక్షల సీట్లతో కౌన్సెలింగ్ నిర్వహించగా, అందులో దాదాపు లక్ష సీట్లు నిండాయి. ఈసారి ఏఐసీటీఈ కొత్తగా 15 వేల సీట్లను పెంచడంతో మొత్తం సీట్ల సంఖ్య 1.38 లక్షలకు చేరింది. వీటిలో కొన్ని ప్రైవేటు వర్సిటీలకు సంబంధించిన ఆఫ్ క్యాంపస్ సీట్లు కూడా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. కొత్త సీట్లకు అనుమతులు వస్తే ఈ ఏడాది పోటీ మరింత తగ్గే అవకాశం ఉందని, ఎక్కువ మంది విద్యార్థులకు నచ్చిన కోర్సుల్లో సీట్లు దొరికే చాన్స్ ఉందని ఆఫీసర్లు చెప్తున్నారు. అయితే, ప్రస్తుతం ఇంజినీరింగ్ సీట్లలో 70శాతం సీట్లు కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ కోర్సుల్లోనే ఉన్నాయి. 

పర్మిషన్ ఇస్తేనే కౌన్సెలింగ్‌‌లోకి..

ప్రస్తుతం కొత్త సీట్లపై జేఎన్టీయూ, ఓయూ, కేయూ సహా పలు వర్సిటీలు ఆయా కాలేజీల్లో ఉన్న వసతులపై కసరత్తు చేస్తున్నాయి. ఏఐసీటీఈ అనుమతి ఇచ్చిన సీట్లకు తగ్గట్టుగా కాలేజీల్లో ల్యాబ్‌‌లు, ఫ్యాకల్టీ, ఇతర మౌలిక సదుపాయాలు ఉన్నాయా? లేదా? అని అధికారులు పరిశీలించనున్నారు. వీటి ఆధారంగా నివేదికను ప్రభుత్వానికి పంపనున్నారు. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ఈ కొత్త సీట్లను కౌన్సెలింగ్‌‌లో చేర్చుతారు. ఇప్పటికే పలు వర్సిటీలు గత ఏడాది ఉన్న సీట్ల వివరాలను ఎప్ సెట్ కౌన్సెలింగ్ అధికారులకు అందజేశాయి. ప్రభుత్వం నుంచి కొత్త సీట్లకు అనుమతి లభిస్తే, వాటిని అదనంగా వెబ్‌‌సైట్‌‌లో అప్‌‌డేట్ చేయనున్నారు. 

కన్వీనర్, మేనేజ్‌‌మెంట్ సీట్లకు ఒకేసారి కౌన్సెలింగ్‌‌

ఇంజినీరింగ్‌‌ అడ్మిషన్ల ప్రక్రియలో ఈసారి విద్యాశాఖ కీలక మార్పు చేసింది. ప్రతి ఏటా రెండో విడత కౌన్సెలింగ్‌‌ ముగిసిన తర్వాతే మేనేజ్‌‌మెంట్ కోటా భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అధికారులు, ఈసారి మాత్రం కన్వీనర్ కోటాతో పాటే మేనేజ్‌‌మెంట్ సీట్ల భర్తీకి షెడ్యూల్ జారీ చేశారు. దీంతో ఈ నెల 19 నుంచే రెండు విభాగాల కౌన్సెలింగ్ ప్రక్రియలు ఒకేసారి సమాంతరంగా మొదలుకానున్నాయి. రాష్ట్రంలోని మొత్తం సీట్లలో 70 శాతం కన్వీనర్ కోటా కింద, మిగిలిన 30 శాతం మేనేజ్‌‌మెంట్ కోటా కింద భర్తీ చేయనున్నారు. ఈ నిర్ణయంతో అడ్మిషన్ల ప్రక్రియ మరింత వేగంగా ముగిసే అవకాశం ఉంది.

©️ VIL Media Pvt Ltd.