
Suriya50 : సూర్య కెరీర్‌లో 50వ సినిమా ఏ దర్శకుడితో ఉంటుందనే ప్రశ్నకు ఇంకా అధికారిక సమాధానం రాకపోయినా, కోలీవుడ్‌లో ఒక వార్త హల్చల్ చేస్తోంది. ఒకవైపు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సూర్య, మరోవైపు తన నెక్స్ట్ మూవీ ప్రత్యేకంగా మలచాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ‘జైలర్’తో సంచలన విజయాన్ని అందుకున్న దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ పేరు తెరపైకి రావడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు తనదైన కామెడీ శైలిని జోడించి ప్రేక్షకులను ఆకట్టుకునే నెల్సన్, సూర్యతో చేతులు కలిపితే క్రేజీ ప్రాజెక్ట్ గా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు.
తాజా కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, సూర్య తన 50వ చిత్రాన్ని వినోదాత్మకంగా, విభిన్నంగా రూపొందించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నెల్సన్ దిలీప్‌కుమార్‌తో ఒక కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్ గురించి చర్చలు జరిగినట్లు ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు ‘సూర్య 50’ అనే వర్కింగ్ టైటిల్ వినిపిస్తోంది. అయితే ఇది ఇంకా ప్రారంభ దశలోనే ఉందని సమాచారం. అయితే ముందుగా జూనియర్ ఎన్టీఆర్ తో ఆయన సినిమా చేయాలనుకున్నారు. జూనియర్ ‘డ్రాగన్’, ‘దేవర’ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండటంతో సూర్యతో కమిట్ అయ్యారని తెలుస్తోంది.
ఇక ఈ కాంబినేషన్ కూడా వెంటనే సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే నెల్సన్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్‌తో తెరకెక్కిస్తున్న ‘జైలర్ 2’ పనుల్లో బిజీగా ఉన్నారు. అంతేకాకుండా మరో భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో సూర్యతో సినిమా తెరకెక్కాలంటే కొంత సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నప్పటికీ, సూర్య, నెల్సన్ కాంబినేషన్ నిజమైతే అది కోలీవుడ్‌లోనే కాకుండా దక్షిణాది సినిమా పరిశ్రమలో అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలిచే అవకాశం కనిపిస్తోంది.
ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రంలో ఈ నటుడు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మమితా బైజు నటిగా నటిస్తున్న ఈ చిత్రం 2026 ఆగస్టు 14న విడుదల కానుంది, దీని మొదటి సింగిల్ ప్రోమో 2026 జూన్ 17న రానుంది. మరోవైపు సూర్య ఇటీవల ఆర్.జె. బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కరుప్పు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 300ల కోట్ల మార్క్ అందుకున్న ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీ ఆడియన్స్ ని కూడా అలరిస్తోంది. ఈ చిత్రంలో త్రిష కృష్ణన్, ఆర్.జె. బాలాజీ, ఇంద్రన్స్, అనఘ మాయ రవి, నటరాజన్ సుబ్రమణ్యం, స్వసిక, శివద కీలక పాత్రలు పోషించారు.