Reading Time: 2 minutes
Staff Vs Trust Board Vijayawada Durga Temple Row Sparks Controversy At Indrakeeladri

OTR: అమ్మవారి సన్నిధిలో అమీతుమీకి రెడీ అవుతున్నారా? గర్భగుడి నుంచి ఆఫీసులదాకా.. చిత్ర విచిత్రమైన వివాదాలు రేగుతున్నాయా? అమ్మకు సేవకులమన్న సంగతి మర్చిపోయి.. అంతా అధికార దర్పం ప్రదర్శించడానికి మాత్రమే పరిమితం అవుతున్నారా? బెజవాడ ఇంద్రకీలాద్రి మీద ఏం జరుగుతోంది? పాలక మండలి, ఉద్యోగుల మధ్య ఎక్కడ చెడింది?

రోజుకో గొడవ, పూటకో వివాదం అన్నట్టు తయారవుతోంది బెజవాడ ఇంద్రకీలాద్రి మీద వ్యవహారం. రాను రాను అమ్మవారి సన్నిధిలో ఆధ్యాత్మిక వాతావరణం పెరగడానికి బదులు ఘర్షణ పూరిత వ్యవహారాలు పెరుగుతున్నాయంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అది అధికారులైనా, అర్చకులైనా, పాలకమండలి సభ్యులైనా…. వాళ్ళు ఎవరైనాసరే…. ఇంద్రకీలాద్రి మీద అడుగు పెట్టి బాధ్యతల్లో ఉన్నారంటే అమ్మవారి సేవకులే తప్ప అధికార ప్రదర్శనకు ఆస్కారం ఉండకూడదు.

Nara Lokesh: ఏపీలో ఉద్యోగల జాతర.. 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం.. మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయాలు..!

కానీ.. ఇప్పుడు ఆ సేవా భావన పక్కకు వెళ్లి అడుగడుగునా బాధ్యతారాహిత్యం కనిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పెత్తనం కోసం ఒక వర్గం, ప్రభావం చూపేందుకు ఇంకొందరు కాసుల కక్కుర్తితో మరికొందరు ఎవరికి వారు… తామే సర్వం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. దీంతో భక్తి క్షేత్రం ఆధ్యాత్మికం కంటే ఎక్కువగా వివాదాస్పద వార్తల్లో నిలుస్తోంది. అమ్మవారి ఆలంలో ఇటీవల ఘనంగా కుంభాభిషేకం నిర్వహించారు. అంత పవిత్రమైన ఆ సందర్భాన్ని సైతం వివాదాలు వీడలేదు.

ఇంకా చెప్పాలంటే ఉద్రిక్తతకు దారితీసింది. ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ కుమారుడు స్నేహితులతో కలిసి దర్శనానికి వచ్చాడు. వేద ఆశీర్వచన మండపం నుంచి పరంజా మీదుగా శిఖరం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే విధుల్లో ఉన్న ఉద్యోగి.. సంప్రదాయ దుస్తులు తప్పనిసరి అంటూ వాళ్ళని ఆపడంతో గొడవ మొదలైంది. పంచె కట్టుకోవాలని, ప్యాంట్, చొక్కాతో వెళ్లరాదని ఉద్యోగి చెప్పడంతో.. ఆగ్రహం చెందిన చైర్మన్ కుమారుడు విషయం తండ్రికి చెప్పాడట. దాంతో ఈవో కార్యాలయంలోనే ఆ ఉద్యోగిపై చేయిచేసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి.ఈ ఘటన ఆలయ వాతావరణాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. కేసు పెట్టాల్సిందేనని ఉద్యోగులు పట్టుబట్టగా.. మహాక్రతువు కొనసాగుతున్నందున అంతదాకా వెళ్ళవద్దంటూ.. దేవదాయ శాఖ కమిషనర్ జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దినట్టు తెలిసింది.

అదొక్కటే కాదు.. కొద్ది రోజుల క్రితం ఓ సభ్యురాలు పదిమందితో దర్శనానికి వెళ్ళారట. తనతో కుటుంబ సభ్యులకే అనుమతి ఉందని సిబ్బంది చెప్పడంతో ఆమె వినకుండా నానా రచ్చ చేసినట్టు తెలిసింది. వెనక వస్తున్న వాళ్ళంతా మా వాళ్ళేనంటూ హంగామా సృష్టించినట్టు తెలిసింది. ఇక హుండీ లెక్కింపు సమయంలో ఓ సభ్యుడు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆభరణాలు పరిశీలనలో భాగంగా వేరు చేసిన సందర్భంలో ప్రక్రియ పూర్తికాకముందే అప్రైజర్‌ను నిలదీశారు. ఆ హడావిడితో చివరకు అప్రైజర్‌పై వేటు వేయాల్సి వచ్చిందట. ఇలాంటి వరుస ఘటనలు ఉద్యోగుల్లో అసంతృప్తిని పెంచుతున్నాయంటున్నారు.

KKR Vice-Captain Curse: వైస్ కెప్టెన్ శాపమా?.. కేకేఆర్ ప్లేయర్స్ వరుసగా పోతున్నారు, నెక్స్ట్ ఎవరంటే?

అలాగే ధర్మకర్తల మండలి సభ్యులు పలు విభాగాల్లో నేరుగా తనిఖీలు నిర్వహిస్తున్నారన్న విమర్శలున్నాయి. వాళ్ళే ఉన్నతాధికారుల మాదిరిగా వ్యవహరిస్తూ ఉద్యోగులపై పెత్తనం చేయడం ఏంటని నిలదీస్తున్నారు ఉద్యోగులు. లోపాలు గమనిస్తే అధికారులకు తెలియజేయాల్సి ఉండగా.. సభ్యులే నేరుగా జోక్యం చేసుకోవడం వ్యవస్థాపకంగా సరైంది కాదని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. ఇక కార్యాలయాల వ్యవహారంలోనూ చర్చ మొదలైంది. ఇంద్రకీలాద్రి పరిమిత స్థలంలో ఉన్నప్పటికీ ఈసారి చైర్మన్‌కు ఒక చాంబర్, సభ్యులకు మరో చాంబర్ కేటాయించారు.

దీంతో ఇన్ని ఆఫీసులు అవసరమా..వ్యయభారం పెరుగదా..అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆలయ వనరుల్ని భక్తుల సౌకర్యాలకే వినియోగించాలనే వాదన ఉద్యోగుల్లో బలపడుతోంది. ఇలాంటివన్నీ కలగలిపి ఇప్పుడు దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో స్పష్టమైన రేఖ గీసినట్టుగా పరిస్థితి మారుతోంది. ఒకవైపు ధర్మకర్తల మండలి, మరోవైపు ఉద్యోగులు ఇంకో పక్క అర్చకులు.. ఇలా ఎవరికి వారు వర్గాలుగా విడిపోతున్నారు. ఇప్పటి వరకు మౌనం పాటించిన సిబ్బంది ఇకపై అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.అమ్మవారి సన్నిధిలో ఇలాంటి పరిణామాలు కొనసాగితే భక్తుల విశ్వాసంపై ప్రభావం పడే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.