Reading Time: 2 minutes
Ap Cabinet Decisions Amaravati Polavaram Msme Support Chandrababu Naidu

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. దీనిలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణం నుంచి సాగునీటి ప్రాజెక్టుల వరకు పలు అంశాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సీఎం చంద్రబాబు నేతృత్వంలో శుక్రవారం జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం రాష్ట్ర ప్రగతికి దిశానిర్దేశం చేసింది. అమరావతిలో ప్రతిష్ఠాత్మకమైన సచివాలయం, ప్రభుత్వ విభాగాధిపతుల (HOD) టవర్ల నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భవనాల్లో మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల కోసం రూ.2,316 కోట్ల పరిపాలన అనుమతులను మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

Also Read:Hyderabad: అందుబాటులోకి మరో అర్బన్ పార్క్.. గుర్రంగూడ అటవీ ప్రాంతాన్ని రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటన..

మంత్రివర్గ నిర్ణయాలు ఇలా..   
రాజధానిలో తెలుగు సంస్కృతిని చాటిచెప్పేలా రూ.119 కోట్లతో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి ఆమోదం తెలిపారు. అమరావతిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చిన్నతరహా పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా 17 వేల మందికి కొత్తగా ఉపాధి కల్పించాలని నిర్ణయించారు. దీనికోసం 3,500 సూక్ష్మ పరిశ్రమలకు రూ.300 కోట్ల ఆర్థిక సాయం అందించనున్నారు. మహిళా ఉద్యోగుల కోసం ‘సఖీ నివాస్’ పేరుతో పిల్లల సంరక్షణ సౌకర్యాలు కలిగిన హాస్టళ్లను ఏర్పాటు చేయనున్నారు.

Also Read:Gas Effect: గ్యాస్ కొరత.. పెరిగిన హోటల్ ఫుడ్ ఐటమ్స్ ధరలు..

పోలీసు శాఖలో 300 మంది హెడ్ కానిస్టేబుల్ పోస్టులను రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్ (RSI) పోస్టులుగా అప్‌గ్రేడ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ ఆర్డర్‌లో పోలవరం, మార్కాపురం జిల్లాలను చేర్చాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపనున్నారు. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన పనుల కోసం దాదాపు రూ.48 కోట్లను అదనంగా కేటాయించారు. మే 15 నాటికి సాగునీరు విడుదల చేయాలని, ఆ లోపు కాలువలు, డ్రెయిన్ల మరమ్మతుల కోసం ‘జలధార’ కార్యక్రమాన్ని ఏప్రిల్ 2 నుంచి 90 రోజుల పాటు చేపట్టాలని సీఎం ఆదేశించారు.

Also Read:Viral: కొత్తగా పెళ్లైన జంట.. బస్టాండ్‌లో భర్తను పకోడి తెమ్మని చెప్పి పరారైన భార్య..

కేబినెట్ అజెండా ముగిసిన తర్వాత సీఎం చంద్రబాబు గ్యాస్ సరఫరా, విద్యుత్ వినియోగంపై చర్చించారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా గ్యాస్ కొరత ఏర్పడకుండా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. గ్యాస్ కొరత వల్ల ప్రజలు ఎలక్ట్రిక్ స్టవ్‌ల వైపు మళ్లుతున్నారని, దీనివల్ల విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 2న ప్రభుత్వ శాఖల పనితీరుపై నివేదికలు విడుదల చేస్తానని.. ఆ ఆధారంగా మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు.