Reading Time: < 1 minute
ఇండిగో CEO రాజీనామా..! ఆయన ప్లేస్‌లో సంస్థను నడిపించేది ఎవరంటే?

భారతదేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. గత మూడు నెలలుగా ఎయిర్‌లైన్ కార్యకలాపాల్లో ఎదురైన సమస్యల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కంపెనీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం కొత్త సీఈఓని నియమించే వరకు ఎయిర్‌లైన్ మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్‌ భాటియా సంస్థ నిర్వహణ బాధ్యతలను చేపడతారు. ఇండిగోను నిర్వహిస్తున్న సంస్థ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ చైర్మన్ విక్రమ్‌ సింగ్‌ మెహతా మాట్లాడుతూ.. కంపెనీ సంస్కృతిని బలోపేతం చేయడం, కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, వినియోగదారులకు మరింత విశ్వసనీయమైన సేవలను అందించడం లక్ష్యంగా రాహుల్ భాటియా తిరిగి బాధ్యతలు చేపడుతున్నారని తెలిపారు.

4,500 విమానాలు రద్దు

గత డిసెంబర్ మొదటి వారంలో ఇండిగో దాదాపు 4,500 విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. పైలట్ డ్యూటీ సమయాలకు సంబంధించిన ప్రభుత్వ నిబంధనలను పాటించడంలో సమస్యలు తలెత్తడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి ఎయిర్‌లైన్ క్షమాపణలు చెప్పింది. ఈ సంఘటన భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన రంగంలో పోటీ పరిస్థితులపై కూడా చర్చకు దారి తీసింది. ఇండిగోలో అతిపెద్ద వాటాను ఇంటర్‌గ్లోబ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కలిగి ఉంది. డిసెంబర్ నాటికి ఈ సంస్థకు ఇండిగో ఆపరేటర్ అయిన ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌లో సుమారు 35.69 శాతం వాటా ఉంది.

షేర్ మార్కెట్‌లో పెరుగుదల

సీఈఓ రాజీనామా వార్తల మధ్య కూడా కంపెనీ షేర్లు పెరుగుదల నమోదు చేశాయి. ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ లిమిటెడ్‌ షేర్లు బీఎస్‌ఈలో 3.46 శాతం లేదా రూ.146.45 పెరిగి రూ.4,382.45 వద్ద ముగిశాయి. ట్రేడింగ్ సమయంలో షేర్ ధర రూ.4,475.25 వరకు పెరిగింది. నిపుణుల ప్రకారం.. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గడం, యుద్ధ ఉద్రిక్తతలు తగ్గవచ్చని డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యల కారణంగా విమానయాన రంగ షేర్లకు మద్దతు లభించిందని చెబుతున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి