Reading Time: < 1 minute
Ap Speaker Ayyanna Patrudu Comments On Ys Jagan And Opposition Status

Speaker Ayyanna Patrudu: మీడియా చిట్ చాట్‌లో ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తనదైన శైలిలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై స్పందించారు. సభలో ప్రతిపక్షం లేకపోవడంపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం పాత్ర ఎంత కీలకమో వివరించారు. సభలో ప్రతిపక్షం కచ్చితంగా ఉండాలి.. అప్పుడే చర్చలు రంజుగా సాగుతాయి. మసాలా లేని భోజనం ఎలా ఉంటుందో, ప్రతిపక్షం లేని సభ కూడా అలాగే ఉంటుంది అని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రాకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.

వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండానే జీతాలు తీసుకుంటున్నారని, పని చేయనప్పుడు జీతం తీసుకునే హక్కు ఎవరికీ లేదని స్పీకర్ స్పష్టం చేశారు. అయితే, జగన్ మాత్రం జీతం తీసుకోవడం లేదని, ఆ విషయంలో వాస్తవాలు ఒప్పుకోవాలని ఆయన పేర్కొన్నారు. వరుసగా 65 రోజులు సభకు హాజరుకాకపోతే నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని, ఈ అంశంపై పార్లమెంట్ స్పీకర్ సలహాలు కూడా తీసుకుంటానని తెలిపారు. మరోవైపు.. జగన్ గతంలో చంద్రబాబును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా అయ్యన్న గుర్తు చేశారు. గతంలో ముగ్గురు ఎమ్మెల్యేలను తీసుకుంటే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని జగన్ అనలేదా? అని ప్రశ్నించారు. జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వడం జరగదని, అయితే రాజశేఖర్ రెడ్డి కొడుకుగా ఆయనకు తగిన గౌరవం ఇస్తామని చెప్పారు.

రాజశేఖర్ రెడ్డికి తనకు మధ్య ఉన్న పాత స్నేహాన్ని ఆయన నెమరువేసుకున్నారు స్పీకర్‌ అయ్యన్నా.. రాజశేఖర్ రెడ్డి నన్ను ‘అయ్యన్న’ అని పిలిచేవారు. పార్టీలు వేరైనా మా మధ్య గొప్ప గౌరవం ఉండేది. విశాఖలో రామానాయుడు స్టూడియో ప్రారంభోత్సవం సమయంలో ఎమ్మెల్యేగా ఉన్న నన్ను మంత్రులతో సమానంగా స్టేజ్ మీదకు పిలిచారు” అని గుర్తు చేసుకున్నారు. కానీ ఇప్పుడు రాజకీయాలు శత్రుత్వంగా మారిపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు..